Chandrababu: అమరావతిపై ఆందోళన వద్దు.. అధికారంలోకి వచ్చాక పనులు పరుగులు పెట్టిస్తాం: చంద్రబాబు

ప్రతి పేదవాడిని ధనికుడిగా మార్చే బాధ్యతను తెదేపా తీసుకుంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఐ-టీడీపీ సదస్సులో ఆయన మాట్లాడారు.

Updated : 09 Jun 2023 20:47 IST

మంగళగిరి: అమరావతి విషయంలో ఆందోళన అక్కర్లేదని, తెదేపా అధికారంలోకి రాగానే పనులు పరుగులు పెట్టిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఐటీడీపీ కార్యకర్తల సదస్సులో పాల్గొన్న ఆయన.. తెదేపా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి విషయం చాలా విలువైందని, ప్రతి ఒక్కరికీ వీటిని చేరువ చేయాలని ఐటీడీపీ కార్యకర్తలకు సూచించారు. ప్రజలకు పార్టీ సిద్ధాంతాలను చేరవేసే విధానం మారుతోందన్నారు. ఐ-టీడీపీ ఆర్గనైజేషన్‌ పనితీరు బాగుందని కితాబిచ్చారు. ఏ సందేశమైనా కార్యకర్తలకు వెంటనే చేరిపోతోందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించారని, ఐటీడీపీ కృషి వల్ల 21 లక్షల మంది సభ్యత్వం నమోదైందని ప్రశంసించారు. ఏ కంటెంట్‌ ఎవరికి పంపాలో వారికి చేరేలా కృషి చేస్తున్నారని చెప్పారు. 

‘‘18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆడబిడ్డ నిధి ప్రకటించాం. అమ్మకు వందనం పథకం కింద రూ.15,000 అందిస్తాం. దక్షిణ భారతంలో జనాభా తగ్గిపోయే పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల్లో పోటీ చేసే వారికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే వారు పోటీకి అనర్హులు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని తొలగిస్తాం. ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. సంపద సృష్టించి ఉద్యోగాలు కల్పించిన పార్టీ తెదేపా. పేదలకు సంపద పంచడం తెలిసిన పార్టీ. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందిస్తాం. 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. బీసీల కోసం భద్రత చట్టం తీసుకొస్తాం. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందిస్తాం. సంపద సృష్టికి పీ-4 నమూనా తీసుకువస్తాం.’’ అని చంద్రబాబు అన్నారు.

ముఖ్యమంత్రి జగన్‌కు కోర్టులో మేలు జరగాలని దేవాదాయ శాఖ మంత్రి పూజలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రతి మతానికి కొన్ని సంప్రదాయాలుంటాయని, వాటిని దెబ్బతీసేలా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. వైకాపాలో మొత్తం జోకర్లు ఉన్నారన్న చంద్రబాబు.. ఎన్నికలకు కార్యకర్తలు అస్త్రాలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి శక్తిమంతమైన ఐటీ సాధనంగా మారాలన్నారు. కార్యకర్తలు సొంత ఊరి నుంచే ఆన్‌లైన్‌లో పని చేసేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. ‘‘ భవిష్యత్‌లో వర్చువల్‌, ఫిజికల్‌ సమాంతరంగా వెళ్తాయి. రెండింటినీ అందిపుచ్చుకునే నాయకత్వం కావాలి. మండలాల వారీగా  వర్క్‌ స్టేషన్ల ఏర్పాటుకు యోచిస్తున్నాం. కార్యకర్తలు పార్టీకి ప్రచార సారథులుగా మారాలి. దోపిడీదారులు, పేదలకు మధ్య జరిగే పోరాటం ఇది. ప్రజల ఆస్తులు దోచుకున్న వారి నుంచి వెనక్కి రాబడతాం. సంపదకు కొదవ లేదు.. సంపదను కొందరు దోచుకున్నారు. సంపదను కాపాడేందుకు నిజమైన పోలీసులుగా ఉంటాం. పేదలను ధనికులను చేస్తాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోరాటానికి సిద్ధంగా ఉండాలి.’’ అని చంద్రబాబు అన్నారు.

ఎన్టీఆర్‌ సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ శక్తిగా ఎదిగారని చంద్రబాబు అన్నారు. రైతులకు రూ.20వేలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించాం. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. సమస్యలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని చైతన్యం తేవాలి. సమస్యల పరిష్కారానికి తెదేపా రావాల్సిన అవసరం ఉందని చాటిచెప్పాలి. గతంలో ఫౌండేషన్‌ వేసిన వాటికే మళ్లీ ఫౌండేషన్‌ వేస్తున్నారు. హైదరాబాద్‌కు దీటుగా మరో నగరం కట్టాలని సంకల్పించాం. అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు.  పార్టీపై విశ్వాసంతోనే 29 వేల మంది రైతులు భూములిచ్చారు. తెదేపా వచ్చాక అమరావతిలో పనులు పరుగులు పెట్టిస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని