Chandrababu: ముస్లిం సోదరులకు న్యాయం చేసే ఏకైక పార్టీ తెదేపా: చంద్రబాబు

కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

Published : 25 Mar 2024 22:21 IST

కుప్పం: ముస్లింలకు 40 ఏళ్లుగా ప్రాధాన్యం ఇస్తూ.. వారికి న్యాయం చేసిన ఏకైక పార్టీ తమదేనని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం కుప్పంలో పర్యటించిన ఆయన స్థానిక కేవీఆర్‌ మండపంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. 

‘‘ఉర్దూను రెండో భాషగా చేసింది తెదేపానే. సమైక్యరాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా చేశాం. ముస్లింలో చాలా మంది పేదలు ఉన్నారని గుర్తించిన ఎన్టీఆర్ 1985లో దేశంలోనే మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించారు. హజ్ యాత్రకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని..హైదరాబాద్‌లో హజ్ హౌస్ నిర్మించి విమాన సదుపాయాన్ని కల్పించాం. రాష్ట్రం విడిపోయాక కడప, విజయవాడలో హజ్ హౌస్‌ల నిర్మాణం చేపట్టి 90 శాతం పూర్తి చేశాం. కానీ వాటిని ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. సమైక్య రాష్ట్రంలో ఉర్దూ యూనివర్సిటీని హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. విభజన తర్వాత కర్నూలుకు తెచ్చాం. ఖురాన్ స్ఫూర్తితో పేద ముస్లింలైన 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చాం. దుకాన్ మకాన్, దుల్హన్ పథకాలను ప్రవేశపెట్టాం. 33 వేల మందికి దుల్హన్ పథకం ద్వారా రూ.165 కోట్లు ఆర్థిక సాయం ఇచ్చిన ఏకైక పార్టీ తెదేపా. విదేశీ విద్య కింద 527 మందిని విద్యార్థులను విదేశాలకు పంపించాం. కానీ, ఈ ప్రభుత్వం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. ఒక్క మైనారిటీ సోదరుడికైనా ఆర్థిక సాయం అందించిందా..? ఒక్క మసీదైనా కట్టారా?’’ అని చంద్రబాబు వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. తాను సీఎంగా ఉన్నంత కాలం ముస్లింలకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని