Congress presidential Polls: ‘పైలట్‌కు మళ్లీ చెక్‌’..విమర్శలకు పదును పెట్టిన భాజపా

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి పోటీ నుంచి వెనకడుగు వేస్తున్నట్లు గహ్లోత్‌ ప్రకటించిన తరుణంలో అధికార భాజపా విమర్శలకు పదును పెట్టింది. గహ్లోత్‌ను సంపూర్ణ రాజకీయనాయకుడిగా అభివర్ణిస్తూ.. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ‘రబ్బరు స్టాంపు’ పదవిని వదులుకున్నారని ఎద్దేవా చేసింది.

Published : 30 Sep 2022 01:10 IST

గహ్లోత్‌ సంపూర్ణ రాజకీయ నాయకుడంటూ చురకలు

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి పోటీ నుంచి వెనకడుగు వేస్తున్నట్లు గహ్లోత్‌ ప్రకటించిన తరుణంలో అధికార భాజపా విమర్శలకు పదును పెట్టింది. గహ్లోత్‌ను సంపూర్ణ రాజకీయనాయకుడిగా అభివర్ణిస్తూ.. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ‘రబ్బరు స్టాంపు’ పదవిని వదులుకున్నారని ఎద్దేవా చేసింది. మరోవైపు సీఎం కుర్చీని ఆశించిన సచిన్‌పైలట్‌కు పార్టీ అధిష్ఠానం మళ్లీ ‘చెక్‌’ పెట్టిందని భాజపా ఐటీ సెల్‌ కన్వీనర్‌ అమిత్‌ మాలవీయ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు.

గతంలో డిప్యూటీ సీఎంగా చేసిన సచిన్‌పైలట్‌కు ముఖ్యమంత్రి అయ్యే దారులు మూసుకుపోయాయని, ఆయన సీఎం కావాలనుకుంటే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగరేసి తన బలాన్ని నిరూపించుకోవాలని, అధినేత్రి సోనియా గాంధీ చుట్టూ ఏర్పడిన కనిపించని పొరను తొలగించాలన్నారు.ఆయన మాటలకు భాజపా జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా మద్దతు తెలిపారు.  దిగ్విజయ్‌ సింగ్‌, శశి థరూర్‌ కలిసి ఉన్న చిత్రాన్ని ట్విటర్‌లో పోస్టు చేశారు. రబ్బరు స్టాంప్‌గా వ్యవహరించే అధ్యక్షుడి కోసం గాంధీ కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. దీనికి గహ్లోత్‌ ఏ విధంగానూ సరిపోరు. అందుకే ఆయన వెళ్లిపోయారు’’ అంటూ రాసుకొచ్చారు. కాంగ్రెస్‌ నిర్వహించబోయేవి అధ్యక్ష ఎన్నికలు కావని, కేవలం రబ్బరు స్టాంపు కోసం జరుగుతున్న ఎన్నికలని ఆయన ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి గహ్లోత్‌ ఇవాళ భేటీఅయిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితులకు బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలా? వద్దా? అనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో ముఖ్యమంత్రిని మార్చే అవకాశముందంటూ వార్తలు వెలువడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని