CM KCR: ఆ ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గరుంది.. ఇదే లాస్ట్‌ వార్నింగ్‌: కేసీఆర్‌

దళితబంధు పథకం అమలు అంశంపై ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్‌ ఇచ్చారు. డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల జాబితా తన దగ్గరు ఉందని అన్నారు. ఇంకోసారి తప్పు చేస్తే పార్టీ నుంచి తొలగిస్తామని గట్టిగా హెచ్చరించారు.

Updated : 27 Apr 2023 18:56 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం అమలు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. దళితబంధుపై  ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్‌ ఇచ్చారు.

భారాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘దళితబంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గర ఉంది. ఆ ఎమ్మెల్యేలకు ఇదే చివరి వార్నింగ్‌. ఇంకోసారి తప్పు చేస్తే పార్టీ నుంచి తప్పిస్తాం. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యత. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల విషయంలోనూ ఆరోపణలు ఉన్నాయి’’ అని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠకు పోకుండా పార్టీ కోసం కలిసి పనిచేయాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సీనియర్‌ నేత కడియం శ్రీహరికి సూచించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని స్పష్టం చేశారు. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని సూచించారు. ఎలాంటి సమస్య ఉన్న అధిష్ఠానంతో చెప్పాలన్నారు. ఎన్నికలే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని ఆదేశించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని