Modi: ‘యువరాజును తరిమేస్తున్నారు’.. వయనాడ్‌ స్థానంపై మోదీ వ్యంగ్యాస్త్రాలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కేరళలోని వయనాడ్‌కు దూరంగా ఉంచాలని లెఫ్ట్‌ పార్టీలు కోరుకుంటున్నాయని ప్రధాని మోదీ(Modi) అన్నారు. 

Published : 27 Feb 2024 17:09 IST

తిరువనంతపురం: కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఉన్న పొత్తుపై ప్రధాని మోదీ(PM Modi) వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. వయనాడ్(Wayanad) స్థానం నుంచి యువరాజును తరిమికొట్టాలని లెఫ్ట్ పార్టీలు కోరుకుంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై పరోక్ష విమర్శలు చేశారు. మంగళవారం కేరళలో పర్యటించిన ఆయన సెంట్రల్ స్టేడియంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

‘‘ఆ రెండు పార్టీలు కేరళలో బద్ధశత్రువులుగా ఉంటాయి. ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటాయి. వేరే రాష్ట్రాల్లో మాత్రం మంచి స్నేహితులుగా మెలుగుతాయి. ఆ పార్టీల నేతలు కలిసి కూర్చొని విందారగిస్తారు’’ అని మోదీ దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీలను BFF(Best Friends Forever) అంటూ ఎద్దేవా చేశారు. ‘‘వయనాడ్‌ నుంచి రాహుల్ గాంధీని వెళ్లగొట్టాలని లెఫ్ట్ పార్టీలు కోరుకుంటున్నాయి. కేరళకు దూరంగా ఉండమని ఆయనకు సలహా ఇస్తున్నాయి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ నుంచి రాహుల్‌ పోటీ!e

రాహుల్ (Rahul Gandhi) ప్రాతినిధ్యం వహిస్తోన్న వయనాడ్‌లో సీపీఐ అభ్యర్థిని నిలబెట్టిన నేపథ్యంలో మోదీ స్పందన వచ్చింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి యాని రాజాను అక్కడి అభ్యర్థిగా ప్రకటించింది. విపక్ష ‘ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీలతో కాంగ్రెస్‌ ప్రస్తుతం సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతోంది. ఇంతలోనే ఇక్కడ ఈ కూటమిలోని సీపీఐ.. తన అభ్యర్థిని ప్రకటించడం గమనార్హం. అలానే ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న కేరళలోని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ సైతం మెజార్టీ ముస్లిం ఓటర్లు ఉన్న వయనాడ్‌ నుంచి పోటీ చేయాలని భావిస్తోందట. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ మరోసారి వయనాడ్‌ నుంచి పోటీలో ఉండకపోవచ్చని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లేదా భువనగిరి నుంచి రాహుల్ పోటీ ఉండొచ్చని తెలుస్తోంది. దీంతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి కూడా ఆయన బరిలో ఉంటారని సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని