Congress Files: రూ.4.8 లక్షల కోట్లు.. ఇదీ కాంగ్రెస్‌ అవినీతి చిట్టా: భాజపా

కాంగ్రెస్‌ పాలనలో రూ.4.8 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ భాజపా ఆరోపించింది. ‘కాంగ్రెస్‌ ఫైల్స్‌’ పేరిట ఆదివారం ఓ వీడియో విడుదల చేసింది.

Published : 02 Apr 2023 18:28 IST

దిల్లీ: ‘రూ.4.8 లక్షల కోట్లు.. ఇదీ తన పాలనలో అవినీతి (Corruption) రూపేణా కాంగ్రెస్‌ (Congress) పార్టీ ప్రజలనుంచి దోచుకున్న డబ్బు’ అంటూ కాంగ్రెస్‌పై భాజపా (BJP) ఆరోపణలకు దిగింది. కాంగ్రెస్‌ అంటే కరప్షన్‌(అవినీతి) అని పేర్కొంటూ.. ‘కాంగ్రెస్‌ ఫైల్స్‌ (Congress Files)’ పేరిట ఆదివారం ఓ వీడియోను విడుదల చేసింది. యూపీఏ (UPA) హయాంలో దేశంలో ఆయా కుంభకోణాలు (Scams) వెలుగుచూశాయంటూ.. వీడియోలో వాటిని ఏకరవు పెట్టింది. బొగ్గు కుంభకోణం, 2జీ స్కామ్‌, కామన్‌వెల్త్‌ క్రీడల కుంభకోణం వంటివి ప్రస్తావించింది. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ‘అవినీతిని కాపాడే ఉద్యమం’ ప్రారంభించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆరోపించిన క్రమంలో ఈ వీడియో వచ్చింది.

కేంద్ర సంస్థలను భాజపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ 14 పార్టీలు ఇటీవల సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘ఆయా కేసుల్లో ఏజెన్సీలు చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంటే.. కొందరు వాటిపై దాడులు చేస్తున్నారు. కోర్టుల్లో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కొన్ని పార్టీలు అవినీతిని కాపాడే ఉద్యమం ప్రారంభించాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలపై తరచూ ఫిర్యాదు చేస్తున్నాయి’ అని విమర్శించారు. ఇదిలా ఉండగా.. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు కేవలం భాజపా రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని