
కాంగ్రెస్ బలహీనపడుతోంది: కపిల్ సిబల్
శ్రీనగర్: నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన వెలువడిన వేళ కాంగ్రెస్‌లోని అసమ్మతి వర్గం మరోసారి తమ గళం విప్పింది. పార్టీ బలహీనపడుతోందని, బలోపేతం చేయాల్సి అవసరం వచ్చిందని మళ్లీ గుర్తుచేసింది.
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్, మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, ఎంపీలు వివేక్ తంఖా, మనీశ్ తివారీ, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జి 23 బృందంలో వీరు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ‘‘పార్టీ బలహీనపడుతోంది. అందుకే మేమంతా మళ్లీ కలిశాం. పార్టీని మెరుగుపర్చేందుకే మేం గళమెత్తుతున్నాం. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కొత్త తరాలు వెలుగులోకి రావాలి. కాంగ్రెస్‌కు మంచిరోజులు చూశాం. అలాంటి పార్టీ పడిపోవడం మేం చూడలేం’’ అని పార్టీ అధినాయకత్వానికి సూచనలు చేశారు.
కాంగ్రెస్ నాయకత్వం, వ్యవస్థాగత నిర్మాణంలో మార్పులు అవసరమంటూ గతేడాది ఆగస్టులో సిబల్, ఆజాద్‌తో పాటు 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరపాలని వారు కోరారు. ఈ అసమ్మతి నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గతంలో సమావేశమైనప్పటికీ ఎలాంటి పురోగతి లభించలేదు. ఇదిలా ఉండగా.. కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ నేతలు సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.