AAP-Congress: ఆర్డినెన్స్‌పై పోరు.. ఆమ్‌ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?
కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలా? వద్దా? అనే అంశంపై కాంగ్రెస్ (Congress) చర్చలు జరుపుతోంది. ఈ మేరకు దిల్లీ (Delhi), పంజాబ్ (Punjab) పార్టీ నేతలతో జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ సమావేశమయ్యారు.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ (Ordinance)పై ఆమ్‌ఆద్మీ పార్టీకి మద్దతివ్వాలా? వద్దా? అనే అంశంపై కాంగ్రెస్ (Congress) మల్లగుల్లాలు పడుతోంది. ఈ మేరకు దిల్లీ, పంజాబ్ కాంగ్రెస్ నేతలతో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ కీలక భేటీ నిర్వహించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మెజార్టీ నాయకులు మద్దతివ్వకూడదనే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఆమ్‌ఆద్మీ పార్టీ పోరును ఉద్ధృతం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక పార్టీ నేతలతో దీల్లీ సీఎం కేజ్రీవాల్ మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మద్దతును కూడా కోరినట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించేందుకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి ఫోన్ చేసి సమయం కోరినట్లు సమాచారం. అయితే, పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత తమ నిర్ణయం వెల్లడిస్తానని ఖర్గే సమాధానమిచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా భేటీ జరిగినట్లు తెలుస్తోంది.
కేజ్రీవాల్‌కు మద్దతివ్వడం వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, అతడు దిల్లీ, పంజాబ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ను దెబ్బతీశారని సమావేశం సందర్భంగా పలువును నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. కేజ్రీవాల్.. భాజపాకి బీ-టీమ్ అనీ, ఆ పార్టీకి మద్దతిస్తే.. భాజపాకి ఇచ్చినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ అధిష్ఠానం దీనిని పరిగణనలోకి తీసుకుంటే.. ఆర్డినెన్స్ విషయంలో ఆప్‌నకు సహకరించే అవకాశాలు కనిపించడం లేదు. కానీ, ఇతర రాష్ట్రాల నేతలతోనూ చర్చించిన తర్వాత దీనిపై కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
సమావేశం అనంతరం పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా మాట్లాడుతూ.. తమ అభిప్రాయాలను పార్టీ హై కమాండ్ ముందు ఉంచామని, నిర్ణయాన్ని మాత్రం అధ్యక్షుడు ఖర్గేకి వదిలేశామని చెప్పారు. ఈ సమావేశం అంతర్గత విషయాలకు సంబంధించిందని, పార్టీ అధ్యక్షుడు లేదా రాహుల్ గాంధీ మాత్రమే వివరాలను వెల్లడిస్తారని పంజాబ్ కీలక నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని ఓ పవిత్ర గ్రంథంగా అభివర్ణించిన సిద్ధూ.. దానిని స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పారు. కానీ, ప్రస్తుతం రాజ్యాంగ విలువలు అధోగతి పాలయ్యాయని గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పారు.
మరోవైపు భాజపాకి వ్యతిరేకంగా విపక్షపార్టీలన్నీ కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌తో అర్వింద్ కేజ్రీవాల్ పలుదఫాలు భేటీ అయ్యారు. మరోవైపు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. ఆర్డినెన్స్ విషయంలో కేజ్రీవాల్‌కు మద్దతివ్వాలా?వద్దా? అనే అంశంపై కాంగ్రెస్ ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ ఔషధ రంగంలోకి నిమ్మగడ్డ ప్రసాద్
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్