కేసీఆర్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు.. కానీ..: కోమటిరెడ్డి

ప్రజలకు ఏం చేశారని రూ.కోట్ల ఆర్భాటాలతో తెరాస పార్టీ ప్లీనరీ నిర్వహించిందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated : 28 Apr 2022 14:10 IST

నల్గొండ: ప్రజలకు ఏం చేశారని రూ.కోట్ల ఆర్భాటాలతో తెరాస పార్టీ ప్లీనరీ నిర్వహించిందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. 70 శాతం గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదని చెప్పారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. 

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేశారని ఆయన ఆరోపించారు. తనపై కక్షతోనే నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను కేసీఆర్‌ పూర్తిచేయడం లేదన్నారు. ధరణి సమస్యలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే దాన్ని ఎత్తివేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణను ఏం అభివృద్ధి చేశారని దేశం గురించి మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ తమ పార్టీతో పొత్తు గురించి అడిగినా తమ అధిష్ఠానం ఒప్పుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని చెప్పారు. 

రేవంత్‌ కార్యక్రమానికి హాజరుకావడం లేదు

నల్గొండలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రేపు తలపెట్టిన కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని కోమటిరెడ్డి చెప్పారు. తన నియోజకవర్గంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నందున వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పటిష్ఠంగా ఉందని.. వేరే నేత వచ్చి సమీక్ష జరపాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ బలహీనంగా ఉన్నచోట సమావేశాలు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు సర్వసాధారణమని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. 

అనూష వైద్యవిద్య బాధ్యత నాది..

ఎంబీబీఎస్‌ సీటు సాధించిన విద్యార్థిని తాళ్లపల్లి అనూషకు కోమటిరెడ్డి ఆర్థికసాయం అందించారు. డాక్టర్‌ సీటు వచ్చినా చదివే ఆర్థిక స్థోమత ఆమెకు లేదని.. అనూషను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆమె వైద్య విద్య పూర్తయ్యే వరకు తనదే బాధ్యతని కోమటిరెడ్డి చెప్పారు. రూ.కోట్లు పెట్టినా దొరకని ఎంబీబీఎస్‌ సీటును అనూష కూలి పనిచేసుకుంటూ సాధించిదని కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని