Telangana News: విద్యుత్‌ సౌధ ముట్టడికి మహిళా కాంగ్రెస్‌ యత్నం.. ఉద్రిక్తత

విద్యుత్‌, చమురు ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన విద్యుత్‌ సౌధ, సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.

Updated : 07 Apr 2022 13:20 IST

హైదరాబాద్‌: విద్యుత్‌, చమురు ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన విద్యుత్‌ సౌధ, సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు విద్యుత్‌ సౌధ ముట్టడికి యత్నించారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలని మహిళా నేతలు డిమాండ్‌ చేశారు. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావు ఆధ్వర్యంలో పలువురు నేతలు అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా సునీతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మొండి వైఖరి నశించాలని డిమాండ్‌ చేశారు. తమ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 

ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో విద్యుత్‌సౌధ వద్ద తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మహిళా కాంగ్రెస్‌ నేత విద్యారెడ్డి కిందపడిపోయారు. ఆమెకు శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో హుటాహుటిన నిమ్స్‌కు తరలించారు. అక్కడి డాక్టర్లు విద్యారెడ్డికి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. మరోవైపు సునీత రావు సహా మరో ఐదుగురు మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

విద్యుత్‌సౌధ ముట్టడికి బయల్దేరిన రేవంత్‌

నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా విద్యుత్‌సౌధ ముట్టడికి బయల్దేరారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి పలువురు నేతలతో కలిసి ఆయన ర్యాలీగా ముందుకు కదిలారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, సీనియర్‌ నేత మధుయాష్కీ గౌడ్‌ తదితరులు కాసేపట్లో విద్యుత్‌ సౌధ వద్దకు చేరుకోనున్నారు. 

మరోవైపు అంబర్‌పేటలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఇంటివద్ద పోలీసులు మోహరించారు. అనంతరం వినతిపత్రం అందించేందుకు ఆయన అంబర్‌పేటలోని విద్యుత్‌శాఖ కార్యాలయం వద్దకు వెళ్లారు. తెరాస బూటకపు ధర్నాలకు పోలీసులు అనుమతించారని.. ప్రజల తరఫున కాంగ్రెస్‌ ప్రశ్నిస్తుంటే నేతలను గృహనిర్బంధం చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని