Hema Malini : రాహుల్ ఫ్లయింగ్‌ కిస్‌ ఇవ్వడం నేను చూడలేదు : భాజపా ఎంపీ హేమమాలిని

లోక్‌సభలో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఫ్లయింగ్‌ కిస్‌ ఇవ్వడం తాను చూడలేదని భాజపా ఎంపీ హేమమాలిని (Hema Malini) అన్నారు. అయినా ఆమె కల్పిత ఫిర్యాదుపై సంతకం చేశారని కాంగ్రెస్‌ (Congress) నేత బీవీ శ్రీనివాస్‌ ట్విటర్‌లో విమర్శించారు.

Published : 09 Aug 2023 18:04 IST

దిల్లీ : లోక్‌సభ నుంచి బయటకు వెళుతూ కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)  ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) చేసిన ఆరోపణలపై ప్రముఖ నటి, భాజపా ఎంపీ హేమమాలిని స్పందించారు. తాను అలాంటి సైగను చూడలేదని ఆమె చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని బయటకు వచ్చిన ఆమెను ఓ మీడియా ప్రతినిధి ‘మీరు ఆయన ఫ్లయింగ్‌ కిస్‌ ఇస్తుండగా.. అభ్యంతరకరంగా సైగ చేస్తుండగా చూశారా? అని ప్రశ్నించాడు. దానికి ఆమె బదులిస్తూ.. నాకు తెలియదు. నేను అది చూడలేదు. కొన్ని పదాలు సరిగా లేవని’ చెప్పారు. ఈ వీడియోను కాంగ్రెస్‌ నేత బీవీ శ్రీనివాస్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. ఎలాంటి ఫ్లయింగ్ కిస్‌ చూడలేదని చెప్పిన హేమమాలిని.. కల్పిత ఫిర్యాదుపై మాత్రం సంతకం చేశారని ఆయన విమర్శించారు. 

రాహుల్‌పై ‘ఫ్లయింగ్‌ కిస్‌’ఆరోపణ.. స్పీకర్‌కు మహిళా ఎంపీల ఫిర్యాదు!

ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ మణిపుర్‌ అంశంపై రాహుల్‌ గాంధీ ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా నిలదీశారన్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భాజపా కొత్త వ్యూహాన్ని మధ్యలో తీసుకొచ్చిందని ఆయన విమర్శించారు. ఏ అంశంపై తాము ప్రశ్నించినా అధికార పార్టీ ఎంపీలు సంబంధం లేని విషయాలను మాట్లాడతారని, గతంలో జరిగిన విషయాలను ప్రస్తావించి అసలు విషయాన్ని దారి మళ్లిస్తారని కార్తీ ఆరోపించారు. 

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అనుచితంగా ప్రవర్తించారంటూ భాజపాకు చెందిన మహిళా ఎంపీలు ఆరోపించారు. రాహుల్ సభ నుంచి బయటకు వెళుతూ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ‘స్త్రీ వ్యతిరేకి మాత్రమే పార్లమెంట్‌లో మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు. అలాంటి విపరీతాలను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. ఆయన మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తన తెలియజేస్తోంది. ఇది అసభ్యకరమైనది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆ పార్టీ మహిళా ఎంపీలతో కలిసి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని