Eatala: మాది.. పొంగులేటి, జూపల్లిది ఒక్కటే లక్ష్యం: ఈటల రాజేందర్‌

పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ముఖ్యనేతల బృందం గురువారం భేటీ అయింది

Updated : 04 May 2023 20:44 IST

ఖమ్మం: రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతాపార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. భారాస వ్యతిరేక శక్తులను తమవైపు తిప్పుకొనేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారాస బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావుతో భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ముఖ్యనేతల బృందం గురువారం ఖమ్మం వచ్చి భేటీ అయింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. 

సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం..

దాదాపు 5గంటల పాటు సాగిన భేటీ అనంతరం ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ మా లక్ష్యం, పొంగులేటి, జూపల్లి లక్ష్యం ఒక్కటే. పొంగులేటి, జూపల్లి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. తెలంగాణ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కుటుంబ పరిపాలన అంతమొందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని వాగ్దానం నెరవేర్చే బాధ్యత అమిత్‌ షా, జేపీ నడ్డాపై ఉంది. అమిత్‌ షా, నడ్డా ఆదేశాలతోనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావును కలిశాం. పొంగులేటికి ఒకటే చెప్పాం. ఈ రాష్ట్రంలో కేసీఆర్‌ నిరంకుశ పాలనను బొందపెట్టగలిగే పార్టీ భాజపా మాత్రమే. పార్టీలో చేరాలని కోరాం. అందరం కలిసికట్టుగా మన లక్ష్యాన్ని, ప్రజల ఆశయాన్ని నెరవేర్చిన వాళ్ల మవుతామని చెప్పాం. మా ఆశయం, వారి ఆశయం ఒకటే కాబట్టి కచ్చితంగా పొంగులేటి పాజిటివ్‌గా స్పందిస్తారని భావిస్తున్నాం. కేసీఆర్‌ డబ్బు సంచులతో నేతలను కొనే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

కేసీఆర్‌ను గద్దె దించడమే ఏకైక లక్ష్యం: పొంగులేటి, జూపల్లి

భాజపా ముఖ్యనేతలతో భేటీ అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్రమొస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని కలలు కన్న తెలంగాణ బిడ్డల ఆశయాన్ని సీఎం కేసీఆర్‌ తుంగలో తొక్కారు. వ్యక్తిగత స్వార్థం కోసం పరిపాలన చేస్తున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దించే అంశంలో అందరం ఏకం కావాలి. ఇదే విషయాన్ని అనేక వేదికలపై చెప్పాను. భాజపా ముఖ్యనాయకులతో చర్చల సందర్భంగా కూడా ఇదే విషయం చెప్పాం. ఏ లక్ష్యంతో తెలంగాణ బిడ్డలకు అండగా ఉండాలని భారాస నుంచి బయటికొచ్చామో.. ఆ ఆశయం నెరవేర్చే క్రమంలోనే ఈనాటి సమావేశం. భవిష్యత్‌లో జరగబోయే సమావేశాలు.  కేసీఆర్‌ను గద్దె దించడమే మా అందరి లక్ష్యం. తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే  మా నిర్ణయాలు ఉంటాయి’’ అని పొంగులేటి తెలిపారు. 

ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..

‘‘అమరవీరుల ఆత్మలు శాంతించాలంటే  ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం దక్కకుండా చూడాలి. దానికి ఉన్న మార్గాలను చెప్పారు. ఇవాళ్టి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో చెప్పినట్టుగానే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, సంస్థలు, ఉద్యమకారులు, కళాకారులందరినీ సంఘటితం చేసి.. లక్ష్య సాధన కోసం ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తాం. భాజపా ముఖ్య నేతలకు మేం చెప్పాల్సింది చెప్పాం.. వారు చెప్పేది చెప్పారు. ఏ పార్టీలో చేరాలనేదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా చాలా మందితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నిస్తాం. ప్రజలంతా సంఘటితం కావాలి’’ అని జూపల్లి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని