Assembly Elections: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మోగనున్న నగారా.. నేడే షెడ్యూల్‌ ప్రకటన

ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. యూపీ, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ ప్రకటించనుంది.

Updated : 08 Jan 2022 12:04 IST

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. యూపీ, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ ప్రకటించనుంది. ఈ మధ్యాహ్నం 3.30 గంటల మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు ఈసీ వెల్లడించింది. 

ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ శాసనసభల గడువు మార్చితో ముగియనుండగా.. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ గడువు మే నెలతో పూర్తవుతుంది. ఈ రాష్ట్రాలకు మార్చి-ఏప్రిల్‌ మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. యూపీలో 403 శాసనసభ నియోజకవర్గాలుండగా.. ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది. 

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. వైరస్‌ ఉద్ధృతి వేళ.. ఎన్నికల ప్రచారాలు సూపర్‌ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీ ప్రతినిధులతో భేటీ అయ్యింది. ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని పార్టీలు కోరుతున్నాయని ఈసీ ఇటీవల వెల్లడించింది. మరోవైపు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతోనూ పలుమార్లు భేటీ అయిన ఈసీ.. కొవిడ్‌ పరిస్థితుల గురించి ఆరాతీసింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని కేంద్రాన్ని సూచించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని