presidential Election: విపక్షాలకు మరో షాక్‌.. రాష్ట్రపతి రేసుకు నో చెప్పిన ఫరూఖ్‌ అబ్దుల్లా

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతోన్న వేళ.. వారికి మరో షాక్‌ తగిలింది. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉండేందుకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా కూడా నిరాకరించారు.

Published : 19 Jun 2022 01:36 IST

శ్రీనగర్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతోన్న వేళ.. వారికి మరో షాక్‌ తగిలింది. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉండేందుకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా కూడా నిరాకరించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఇటీవల పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా పేర్లను మమత ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనల నుంచి తన పేరును ఉపసంహరించుకుంటున్నట్లు ఫరూఖ్‌ నేడు తెలిపారు.

‘‘రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మమతా బెనర్జీ నా పేరును ప్రతిపాదించడం ఆనందంగా ఉంది. ఆ తర్వాత చాలా మంది విపక్ష నేతలు నాకు ఫోన్‌ చేసి మద్దతు తెలిపారు. అది నా మనసును ఎంతగానో హత్తుకుంది. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ అనూహ్య ప్రతిపాదనపై నేను మా పార్టీ సీనియర్‌ నేతలు, కుటుంబసభ్యులతో చర్చించాను. అయితే ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ అనిశ్చిత పరిస్థితుల నుంచి జమ్మూకశ్మీర్‌ను బయటపడేసేందుకు నా వంతు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. క్రియాశీల రాజకీయాల్లో ఇంకా కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నా. జమ్మూకశ్మీర్‌తో పాటు ఈ దేశ సేవలో సానుకూల సహకారం అందించేందుకు ఎదురుచూస్తున్నా. అందువల్ల రాష్ట్రపతి రేసు నుంచి నా పేరును ఉపసంహరించుకుంటున్నా. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి నా మద్దతు ఉంటుంది’’ అని ఫరూఖ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

అంతకుముందు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండేందుకు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ కూడా నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ పదవికి పవార్‌ పేరును మమత ప్రతిపాదించగా.. ఇంకా క్రియాశీల రాజకీయాల్లో ఇన్నింగ్స్ ఆడాల్సి ఉందని చెప్తూ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకోవడంలో సఫలమవుతాయన్న దానిపై శరద్‌ పవార్‌ నమ్మకంగా లేరట. అందుకే ఓడిపోయే పోరులో బరిలోకి దిగేందుకు ఆయన సుముఖంగా లేరని ఇదివరకే ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా.. జూన్‌ 15న దీదీ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశం సశేషంగా ముగిసింది. దీంతో 20-21వ తేదీల్లో మరోసారి భేటీ కావాలని ప్రతిపక్ష నేతలు నిర్ణయించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని