Gaddam Prasad Kumar: తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు.

Updated : 14 Dec 2023 11:58 IST

హైదరాబాద్‌: నాలుగు రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, భారాస ఎమ్మెల్యే కేటీఆర్‌తో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఆయన్ను స్పీకర్‌ స్థానం వద్దకు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర నేతలు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు. స్పీకర్‌ పదవికి ప్రసాద్‌కుమార్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం భారాసతో పాటు మజ్లిస్‌, సీపీఐ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.

మంచి సంప్రదాయానికి తొలిరోజే నాంది: సీఎం రేవంత్‌

స్పీకర్‌ ఎన్నికకు సహకరించిన పార్టీలకు సీఎం రేవంత్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మంచి సంప్రదాయానికి తొలిరోజే సభ నాంది పలికిందని, భవిష్యత్‌లోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్‌ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించారని, ఆయనతో కలిసి పని చేసినందుకు గర్విస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా గడ్డం ప్రసాద్‌ సలహాలు ఇవ్వాలన్నారు. భారాస అధినేత కేసీఆర్‌ ఆదేశాలతో ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినట్లు మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఎంపీటీసీ నుంచి స్పీకర్‌గా ఎదిగిన గడ్డం ప్రసాద్‌ జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ పని చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శాసనసభ దేవాలయం లాంటిదని, ప్రజాస్వామ్య పరిపుష్టికి ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు. 

అంతకుముందు పలువురు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రమాణం చేశారు. ఆ తర్వాత భారాస నుంచి కేటీఆర్‌, పద్మారావు, పాడి కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. సభ్యుల ప్రమాణ స్వీకారాలు పూర్తయిన అనంతరం స్పీకర్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ అధికారికంగా ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు