ఐదేళ్ల ‘విద్వేషం.. విధ్వంసం’

జగన్‌ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు.

Updated : 06 May 2024 06:40 IST

అరాచకాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌
దౌర్జన్యాలు, కేసులు, దాడులే... ఆయన పాలన
ఐదేళ్లపాటు చేసిందంతా దారుణకాండ
చట్టాలను చుట్టేసి దర్జాగా దోపిడీ
జిల్లాల్లో సీఎం వందిమాగధుల ఇష్టారాజ్యం
ఈనాడు, అమరావతి

ఒక్క అవకాశమని వచ్చి...
అంతా అతలాకుతలం చేసి...
అభివృద్ధికి సమాధికట్టి..
ప్రజాస్వామ్యాన్ని బజారుపాలు చేసి...
ప్రత్యర్థులను జైలుపాలు చేసి...
దాడులు, దందాలు, దౌర్జన్యాలే ఎజెండాగా...
జగన్‌ సాగించింది...
కనీవినీ ఎరుగని ధ్వంసరచన!
పైకి సంక్షేమ వేషం...
ఐదేళ్లలో చిమ్మిందంతా విద్వేషం!


నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా తెదేపా ప్రభుత్వంలో 2.13 లక్షల మంది యువతకు శిక్షణనిస్తే... కక్షపూరితంగా కేసులు నమోదు చేయించి, ప్రతిపక్షనేత చంద్రబాబును సైతం అరెస్టు చేయించే వరకు జగన్‌ శాంతించలేదు. వైకాపాకే చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని సీఐడీ అరెస్ట్‌ చేయడమే కాకుండా, విచారణ పేరిట చిత్రహింసలకు గురిచేశాకే జగన్‌ మనసు కుదుటపడింది.


ఏపీలో లాభసాటిగా ఉన్న వ్యాపారాలు, కాంట్రాక్టులు, ప్రాజెక్టుల పనులు అన్నీ ప్రభుత్వ కీలక పెద్దలే తీసుకున్నారు. రాష్ట్రమంతా ఇసుక దోపిడీని ‘ముఖ్య’ నేత సోదరుడు, నెల్లూరులో క్వార్ట్జ్‌ దందాను కీలక నేత, సిలికా శాండ్‌ను మరో నేత.. ఇలా సంపాదన అధికంగా ఉండే వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.


ఏ ప్రభుత్వమూ వాడుకోని రీతిలో జగన్‌ సీఐడీని తన జేబు సంస్థలా మార్చుకున్నారు. ప్రభుత్వ తీరుపై ఎవరు గళమెత్తినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టుపెట్టినా... వారిని సీఐడీ వెంటాడి, వేటాడి కేసులు పెట్టింది. కొందరిపై ఏకంగా రాజద్రోహం కేసులు బనాయించి రాక్షసానందం పొందింది.

ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టినందుకు గుంటూరుకు చెందిన వృద్ధురాలు రంగనాయకమ్మపై సీఐడీ కేసుపెట్టి వేధించింది. ఓ పోస్టును ఫార్వర్డ్‌ చేసినందుకు సీనియర్‌ జర్నలిస్టు అంకబాబుకు నరకం చూపించింది.

మాజీ మంత్రి గంటా అనుచరుడైన నలంద కిశోర్‌ను ఇదేవిధంగా కేసుపెట్టి వేధించడంతో ఆయన చనిపోయారు.

కనబడిన చోటల్లా కబ్జాలు కాదంటే దందాలు ఇదీ జగన్‌ మూక నైజం

జగన్‌ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు. కానీ జగన్‌... అందరికంటే భిన్నం కదా. తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనమని విర్రవీగారు. పీఠమెక్కింది మొదలు రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పనిచేశారు. ఐదేళ్లూ తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటూ నిరంతరం ధ్వంసరచనపైనే ఆలోచనలు చేసి, వాటిని శరవేగంగా అమలు చేశారు.

తొలి అడుగు...కూల్చివేతతో!

సీఎం జగన్‌ తన ధ్వంస రచనకు ప్రజావేదిక కూల్చివేతతో శ్రీకారం చుట్టారు. మొదట అక్కడే కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించిన సీఎం... ఆ తర్వాత దాన్ని కూల్చివేయాలని\ ఆదేశించారు. ఈ వేదిక ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసానికి ఆనుకొని ఉండటంతో తన కార్యకలాపాల కోసం కేటాయించాలని ప్రభుత్వానికి ఆయన లేఖ కూడా రాశారు. అయినా, జగన్‌ ఏమాత్రం పట్టించుకోకుండా బుల్డోజర్లను పంపించి రూ.7 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను నేలమట్టం చేశారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సభకు స్థలమిచ్చారనే కక్షతో ఇప్పటం అనే చిన్న గ్రామంలో రోడ్ల విస్తరణ పేరిట పేదల ఇళ్లను కూల్చారు. విశాఖలో పచ్చటి రుషికొండను ధ్వంసం చేసి, తాను నివసించేందుకు రూ.450 కోట్లతో ఏకంగా ప్యాలెస్‌ నిర్మించుకున్నారు.

అమరావతిపై కక్ష సాధింపు

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకుండా తయారైన ఏపీ కోసం... 29 వేల మంది రైతులు తమ 33 వేల ఎకరాల భూములిచ్చి అమరావతి నిర్మాణానికి బాటలు వేస్తే... అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జగన్‌ దాన్ని నాశనం చేశారు. 2019 ఎన్నికల సమయంలో రాజధానిని మార్చే ఉద్దేశమేలేదని, అమరావతే రాజధానిగా కొనసాగుతుందని, అందుకే జగన్‌ తాడేపల్లిలో ఇల్లు నిర్మించుకున్నారంటూ ఆయన అనుచరులు అందర్నీ నమ్మించారు. నిజమే అనుకొని రాజధాని ప్రాంత ప్రజలూ జగన్‌కు జైకొట్టారు. తీరా సీఎం కుర్చీలో ఆసీనులవగానే ఆయనలోని అపరిచితుడు బయటకొచ్చాడు. మూడు ప్రాంతాల అభివృద్ధి అంటూ మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చి... అమరావతిని కుప్పకూల్చారు. రాజధానిలో అభివృద్ధిని స్తంభింపజేశారు. రూ.వేల కోట్ల విలువైన రాజధాని ప్రాంతాన్ని నిర్మానుష్యం చేశారు. మూడు రాజధానులు వద్దని, ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, భూములిచ్చిన రైతులు ఉద్యమిస్తే వారిని దారుణంగా అణచివేశారు. మూడు రాజధానులనేది కుదరదంటూ హైకోర్టు స్పష్టంచేయగా... జగన్‌ సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఇలా అయిదేళ్లలో రాజధానిలో ఒక్క ఇటుక పేర్చనివ్వకుండా, తట్ట మట్టి వేయకుండా చేశారు.

పరిశ్రమలు పరారు...

అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు.. అన్న చందంగా జగన్‌ ప్రభుత్వ ఉద్యోగాలూ ఇవ్వలేదు... ఉపాధికి ఊతమిచ్చే పారిశ్రామికాభివృద్ధినీ చేయలేదు. ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా తేలేదు. కనీసం ఉన్న వాటినైనా కొనసాగేలా చూశారా... అంటే అదీ లేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలన అనగానే శ్రీసత్యసాయి జిల్లాలో ఏర్పాటుచేసిన కియా పరిశ్రమ గుర్తొస్తుంది. జగన్‌ ప్రభుత్వ హయాంలో ఇలాంటి భారీ పరిశ్రమ ఒక్కటీ రాలేదు. అనంతపురం నగర శివారులో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైతే, అక్కడి వైకాపా ఎమ్మెల్యే బెదిరింపులు, వసూళ్ల పర్వంతో ఓ నమస్కారం పెట్టి... వెళ్లిపోయింది. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన అమర్‌రాజా కంపెనీపై వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది. చివరకు ఆ పరిశ్రమ విస్తరణను ఆపేసి, ఆ ప్లాంట్‌ను తెలంగాణకు మార్చుకుంది.

దాడుల్లో పరాకాష్ఠ

జగన్‌ సీఎం అయినప్పటి నుంచి ప్రతిపక్ష నేతల కార్యాలయాలపై దాడులు... ఆస్తులను ధ్వంసం చేసే సంస్కృతికి తెరలేచింది. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలోకి వైకాపా రౌడీమూకలు చొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డాయి. అటువంటి ఘటనలను ఖండించాల్సిన సీఎం జగనే... ‘వారి మనసుకు ఏం నొచ్చుకుందో’ అని వ్యాఖ్యానించారంటే ఆయన శాడిజం ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. గన్నవరంలోని తెదేపా కార్యాలయంపై దాడిచేసి దహనం చేశారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటిస్తే... ఆయన బస్సుపై రాళ్లు విసిరారు. దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అప్పటి డీజీపీ గౌతమ్‌సవాంగ్‌... ‘నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు’ అంటూ వ్యాఖ్యానించి అధికార పార్టీకి వంతపాడారు. అంగళ్లు వద్ద చంద్రబాబుపైకి వైకాపా మూకలు రాళ్లు రువ్వాయి. ఆయన భద్రతా సిబ్బంది వాటిని అడ్డుకోవాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ అనుచరులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బందికి గాయమైంది. వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌ తన అనుచరులు, రౌడీ  మూకలతో కలిసి చంద్రబాబు ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు జగన్‌.

వైకాపా నేతల కన్నుపడితే కబ్జానే

అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను వైకాపా నేతలు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర బాధ్యుడిగా విజయసాయిరెడ్డిని నియమించి ప్రశాంతమైన విశాఖ నగరంలో అల్లకల్లోలం సృష్టించారు. విశాఖలో విలువైన భూములను, కొందరి ఆస్తులను బలవంతంగా లాక్కున్నారు. జగన్‌ సీఎం అయిన కొద్దిరోజులకే కడప నేతలు కొందరు విశాఖలో మకాంవేసి.. వాళ్లు కన్నేసిన భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి, బెదిరించి, భయపెట్టి తమ వశం చేసుకున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న రూ.2 వేల కోట్ల విలువైన 15 ఎకరాలను కొట్టేశారు. ఎండాడలో హయగ్రీవ సంస్థకు ఇచ్చిన ఎంతో విలువైన భూములను, మధురవాడలో ఎన్‌సీసీకి చెందిన రూ.1,500 కోట్ల భూములను... ఇలా ఎన్నో లాక్కున్నారు.

దళితులపై దాడులు... అర్చకులపై దౌర్జన్యాలు

కొవిడ్‌ సమయంలో అడిగినన్ని మాస్కులు ఇవ్వలేదని ప్రశ్నించినందుకు దళితుడైన డాక్టర్‌ సుధాకర్‌ను జగన్‌ ప్రభుత్వం వెంటాడి, వేధించి మరణించేలా చేసింది. తన వద్ద పనిచేసిన దళితుడైన డ్రైవర్‌ సుబ్రమణ్యంను వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి, మృతదేహాన్ని వాళ్ల ఇంటికే డెలివరీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఇసుక తవ్వకాలపై ప్రశ్నించిన దళిత యువకుడు ఇండుగమల్లి వరప్రసాద్‌కు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై సమక్షంలో శిరోముండనం చేసేవరకు వైకాపా నేతలు శాంతించలేదు. గతంలో దళిత యువకులకు శిరోముండనం చేయించిన కేసులో వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు విశాఖపట్నం కోర్టు 18 నెలల జైలు శిక్ష వేశాక.. ఆయనతో మండపేట వైకాపా అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయించారు. ఒక వైకాపా నేత ఓ అర్చకుడిని చర్నాకోలాతో కొడితే, మరొకచోట మెడలో జంధ్యం తెంచేశారు. ఇటీవలే కాకినాడలో ఒక వైకాపా నేత అర్చకునిపై దాడికి దిగారు. కొందరు వైకాపా మంత్రుల మాటతీరు బాగోలేదన్న ఒంగోలు   వైకాపా నేత గుప్తాపై దాడిచేసి, నరకం చూపించారు.

సామంత రాజ్యాల్లో దారుణాలు

రాష్ట్రాన్ని హిట్లర్‌లా పాలించిన జగన్‌... పలు ప్రాంతాలకు సామంత రాజుల్లా నాయకులను తయారు చేసి, వారికి పూర్తిస్థాయిలో పెత్తనమిచ్చారు. పుంగనూరును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, చంద్రగిరిని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి, తిరుపతిని భూమన కరుణాకర్‌రెడ్డికి, మాచర్లను పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, కాకినాడను ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి, గుడివాడను కొడాలి నానికి, మచిలీపట్నాన్ని పేర్ని నానికి, రంపచోడవరం దాని చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాన్ని అనంతబాబుకు పూర్తిగా రాసిచ్చేసినట్లు చేశారు. అధికార యంత్రాంగమంతా వారికి సాగిలపడేలా చేశారు. దీంతో ఐదేళ్లూ వారు ఆయా ప్రాంతాల్లో చెలరేగిపోయారు. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌పై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు నిరంతరం దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. మాచర్లలో పిన్నెల్లి అరాచకాలకు అడ్డే లేకుండాపోయింది. తూర్పుగోదావరి ఏజెన్సీని ఎమ్మెల్సీ అనంతబాబు తన అడ్డాగా మార్చుకున్నారు. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆగడాలకు హద్ద్దేలేదు. తెదేపా, జనసేన నేతలపై ఆయన అనుయాయులు పలు దఫాలు దాడులకు తెగబడ్డారు.

రాజ్యాంగ సంస్థలపై రుబాబు

జగన్‌ జమానాలో న్యాయస్థానాలను, రాజ్యాంగ సంస్థలను ఖాతరు చేయలేదు. వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనేక ఏకపక్ష నిర్ణయాలపై కోర్టులు పలు దఫాలు మొట్టికాయలు వేశాయి. దీంతో వైకాపా నేతలు, కార్యకర్తలు ఏకంగా జడ్జిలపైనే సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేశారు. అయినాసరే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. హైకోర్టు వెంటపడితేగానీ కేసులు నమోదు చేయలేదు. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదావేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై సీఎం జగన్‌ అంతెత్తున లేచారు. ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలనే ఉద్దేశంతో.. పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించి, ఆఘమేఘాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించారు. అప్పటికే మూడేళ్లకుపైగా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. చివరకు కోర్టు ఆ చట్టసవరణ చెల్లదంటూ తీర్పు చెప్పింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉదయ్‌భాస్కర్‌ ఉండగా.. ఆయన్ను జగన్‌ డమ్మీని చేశారు. కార్యదర్శిగా నిఘా విభాగాధిపతి, జగన్‌ తలలో నాలుకలా వ్యవహరించే పి.సీతారామాంజనేయులుని నియమించి... ఆయనతోనే ఏపీపీఎస్సీని నడిపించారు.

...మనకు అడ్డు చెప్పేదెవరు?

తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్న రెండు సభల్లో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందడాన్ని సాకుగా చూపించి... రహదారులపై సభలు, సమావేశాలు, ర్యాలీలు వంటివి నిషేధిస్తూ అర్ధరాత్రి జీవో జారీచేశారు. అదే సమయంలో నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్రను ఈ జీవో రూపంలో అడ్డుకోవాలని చూశారు. అన్నివర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినా ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు హైకోర్టు జీవోను సస్పెండ్‌ చేసి.. జగన్‌ చెంప చెల్లుమనిపించేలా ఆదేశాలిచ్చింది. ‘‘యథా రాజా.. తథా ప్రజా’’ అంటారు. అలాగే సీఎం జగన్‌ తీరుని బట్టే ఆయన మంత్రులు కూడా ఉంటారు. ‘నా తల వెంట్రుక కూడా పీకలేరు...’ అని సాక్షాత్తూ సీఎం వ్యాఖ్యానిస్తే... మంత్రులు ఏమైనా తక్కువ తింటారా? ప్రతిపక్ష నేతలను బూతులు తిడుతూ వ్యక్తిత్వ హననం చేసేలా గత, ప్రస్తుత మంత్రులు వ్యాఖ్యలు చేశారు. ఇందులో బూతుల మంత్రిగా పేరున్న కొడాలి నానితోపాటు నోటి దురుసు మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, పేర్ని నాని, జోగి రమేశ్‌, అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్‌నాథ్‌... ప్రతి అంశంలోనూ తమ నోటికి పనిచెబుతూ వచ్చారు.

ప్రశ్నిస్తే కేసులు... ఎదిరిస్తే ఊచలు

జగన్‌ పాలనా కాలంలో ప్రతిపక్షాలపై కనీవినీ ఎరగని స్థాయిలో ఉక్కుపాదం మోపారు. ఐదేళ్లలో తెదేపా అధినేత చంద్రబాబుపై ఏకంగా 22 కేసులు పెట్టారు. లోకేశ్‌పై 23, అచ్చెన్నాయుడిపై 21, చింతమనేనిపై 47, పులివర్తి నానిపై 28, కొల్లు రవీంద్రపై 25, అయ్యన్నపాత్రుడిపై 17, చల్లా బాబుపై 17, ధూళిపాళ్ల నరేంద్రపై 16, రఘురామకృష్ణరాజుపై 11, బీటెక్‌ రవిపై 8 కేసులు నమోదు చేశారు. దళిత నేతలు ఎంఎస్‌ రాజు, వంగలపూడి అనిత, తంగిరాల సౌమ్యలపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు బనాయించిన ఘనత జగన్‌కే దక్కుతుంది. సీబీఐ, ఈడీ కేసులతో 16 నెలలు జైలులో ఉన్న జగన్‌... సీఎం కాగానే ప్రతిపక్ష పార్టీలో కీలక నేతలందరినీ ఎలాగైనా జైలుకు పంపాలని కంకణం కట్టుకున్నారు. వివిధ కేసుల్లో ఇరికించి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వంటి నేతలనూ అరెస్టు చేయించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని