icon icon icon
icon icon icon

33 ఏళ్లుగా రాజకీయ వైరం.. అక్కడ ఆ రెండు కుటుంబాల మధ్యే పోటీ!

కర్ణాటకలో శివమొగ్గ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు దశాబ్దాలుగా ప్రధానంగా రెండు కుటుంబాల మధ్యే ఇక్కడ పోటీ నెలకొంది.

Updated : 06 May 2024 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలో ఆ నియోజకవర్గం ప్రత్యేకం. రెండు కుటుంబాల మధ్యే ప్రధాన పోటీ. రాష్ట్రంలో అత్యంత శక్తిమంతమైన రాజకీయ కుటుంబాల నుంచి నేతలు ఇక్కడ పోటీపడుతున్నారు. 33 ఏళ్లుగా ఈ రాజకీయ వైరం కొనసాగుతున్న ఆ నియోజకవర్గమే శివమొగ్గ. షిమోగ అని కూడా పిలుస్తారు.

ఈ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి యడియురప్ప, దివంగత ఎస్‌ బంగారప్ప కుటుంబాల మధ్య హైవోల్టేజ్‌ పోటీ ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో యడియూరప్ప కుమారుడు సిటింగ్‌ ఎంపీ రాఘవేంద్ర భాజపా తరఫున, బంగారప్ప కుమార్తె గీతా శివరాజ్‌కుమార్‌ కాంగ్రెస్‌ తరఫున ఇక్కడ బరిలో ఉన్నారు. ఈమె కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌ భార్య. రాఘవేంద్ర సోదరుడు విజయేంద్ర రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఉండగా.. గీత సోదరుడు మధు బంగారప్ప సిద్ధరామయ్య కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక భాజపా రెబల్‌గా పోటీలో ఉన్న కేఎస్‌ ఈశ్వరప్ప కూడా ఇక్కడ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ వైరం ఇప్పటిది కాదు..

ఈ నియోజకవర్గంలో బంగారప్ప, యడియూరప్ప కుటుంబాల మధ్య రాజకీయ వైరం 33 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ రెండు కుటుంబాల నుంచి బరిలోకి దిగిన నేతలు నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నారు.

  • 1991 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన యడియూరప్ప.. బంగారప్ప సమీప బంధువు కేజీ శివప్ప(కాంగ్రెస్‌) చేతిలో ఓడిపోయారు.
  • 2009లో యడియూరప్ప కుమారుడు రాఘవేంద్ర.. బంగారప్పను ఓడించి తన ప్రతీకారం తీర్చుకున్నారు.
  • 2014లో యడియూరప్ప గెలుపొందగా.. జేడీఎస్‌ టికెట్‌పై పోటీ చేసిన గీత మూడో స్థానంలో నిలిచారు.
  • 2018 ఉప ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాఘవేంద్రపై మధు బంగారప్ప ఓడిపోయారు. ఈ రెండు కుటుంబాల మధ్య ఇంత తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఈసారి ఓటర్లు ఎవరివైపు నిలుస్తారో చూడాలి.

అగ్రనేతల ప్రచారం..

విజయమే లక్ష్యంగా భాజపా, కాంగ్రెస్‌ తరఫున ఇక్కడ అగ్రనేతలు ప్రచారంలోకి దిగారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇప్పటికే ఇక్కడ ప్రచారం నిర్వహించి కార్యకర్తల్లో జోష్‌ నింపారు. మరోవైపు ఇరుపార్టీల తరఫున డజన్‌కుపైగా కీలక నేతలను ఇక్కడ మోహరించారు. భాజపా ముఖ్యంగా మోదీ, యడియూరప్ప పేర్లు చేప్పి ఓట్లు అడుగుతుండగా.. కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఐదు గ్యారంటీలతో ప్రచారం నిర్వహిస్తోంది. గీత భర్త కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ ఈ ప్రచారానికి సినీ గ్లామర్‌ను జోడించారు. భాజపా విజయం సాధిస్తే ఇక్కడ యడియూరప్ప కుటంబం పట్టు మరింత పెరుగుతుంది. గీత గెలుపొందితే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మరింత ప్రోత్సాహం లభిస్తుంది.

కమలానికి తలపోటు..

హిందుత్వ నాయకుడిగా పేరున్న భాజపా సీనియర్‌ నేత కేఎస్‌ ఈశ్వరప్ప పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసి ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. తన కుమారుడు కేఎస్‌ కాంతేశ్‌కు పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో నిరాశకు గురై ఈ చర్యకు పాల్పడ్డారు. ఎన్నికల సమయంలో పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద సహజమే అయినా.. శివమొగ్గ కథ కొంత భిన్నం. ఇక్కడ బరిలో ఉన్న బి.వై.రాఘవేంద్ర భాజపా సిద్ధాంతాలు, ప్రధాని మోదీ నాయకత్వం, హిందుత్వం పేరిట ప్రచారం చేస్తుండగా.. ఈశ్వరప్ప కూడా సరిగ్గా అవే అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. మూడో విడతలో భాగంగా శివమొగ్గలో మే 7న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img