సీఎం ఆస్తుల వివరాలను బయటపెట్టాలి

కేసీఆర్‌ ఎనిమిదిన్నరేళ్ల పాలన అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజలు గోసపడుతున్నారని భాజపా రాష్ట్రకార్యవర్గం అభిప్రాయపడింది.

Updated : 25 Jan 2023 06:14 IST

మంత్రులు, ఎమ్మెల్యేలవి కూడా..
భాజపా రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: కేసీఆర్‌ ఎనిమిదిన్నరేళ్ల పాలన అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజలు గోసపడుతున్నారని భాజపా రాష్ట్రకార్యవర్గం అభిప్రాయపడింది. సీఎం కుటుంబం, భారాస నేతలు అన్నిరకాల మాఫియాలకు చిరునామాగా మారారని ఆరోపించింది.

ఇసుక, మద్యం, గ్రానైట్‌, కాంట్రాక్ట్‌ల ద్వారా అంతులేకుండా అక్రమంగా సంపాదిస్తున్నారని ధ్వజమెత్తింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..వారి బంధువులు ఆస్తుల వివరాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేసింది. మహబూబ్‌నగర్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సీనియర్‌ నేతలు ఏపీ జితేందర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బలపరుస్తూ మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని..మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని.. పోలీసులకు ప్రత్యర్థి పార్టీల నాయకులపై కేసులు బనాయించే పనిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని ఆక్షేపించింది.

రాజకీయ తీర్మానంలోని అంశాలు..

* మిగులు ఆదాయంతో ఏర్పడ్డ తెలంగాణను కేసీఆర్‌ రూ.5 లక్షల కోట్ల అప్పులపాలు చేశారు. రూ.5 వేల కోట్ల డిపాజిట్లతో ఉన్న జీహెచ్‌ఎంసీని రూ.5 వేల కోట్ల అప్పులపాలుచేశారు. కాళేశ్వరంలో ముమ్మాటికి అవినీతి జరిగింది. అది భారాస నాయకులకు ఏటీఎంగా మారిందన్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నాం.

* మద్యం అమ్మకాలతో రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తున్నా దేశంలో ఎక్కడా లేనంతగా పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ వేస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు పెంచారు.

* కేంద్ర పథకాలను అమలుచేయకుండా భారాస ప్రభుత్వం ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. ఎస్సీ సబ్‌ప్లాన్‌ను (ప్రగతి పద్దుగా మార్చి) పక్కనపెట్టిన తీరును ఖండిస్తున్నాం

* తెలంగాణ కోసం ఏర్పడ్డామని చెప్పుకొన్న పార్టీ తమ పేరులోంచి తెలంగాణ పదాన్ని తొలగించి ప్రజల్ని దారుణంగా వంచించింది. తెరాస భారాసగా మారడం విఫలమవుతుంది.

* కేసీఆర్‌ అవినీతి, అరాచక పాలనపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేసిన ప్రజాసంగ్రామ యాత్ర, ఇతర నేతలు చేసిన ప్రజాగోస-భాజపా భరోసా యాత్రలు రాష్ట్ర ప్రజల్ని చైతన్యపరిచాయి. భాజపా పోరాటంలో రాష్ట్ర ప్రజలు భాగస్వాములు కావాలి. అన్ని రంగాల్లో విఫలమైన భారాస ప్రభుత్వాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఏర్పడేలా భాజపాని గెలిపించాలి.


గవర్నర్‌కు ఆహ్వానం లేకపోవడమేమిటి?: సంజయ్‌

మహబూబ్‌నగర్‌, ఈనాడు డిజిటల్‌: ‘గవర్నర్‌కు ఆహ్వానం లేకుండా బడ్జెట్‌ సమావేశాలు ఏర్పాటు చేయడం ఏమిటి? కోర్టు ఆదేశాలనూ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ప్రశ్నించే వారందరినీ కేసీఆర్‌ అణచి వేస్తున్నారు’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో భాజపా రాష్ట్ర కార్యవర్గం ప్రారంభ సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేశారు. రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టి.. కేసీఆర్‌ పుట్టినరోజున ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ జయంతినాడే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. 317 జీవోకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలను, వారి పిల్లలను అరెస్టు చేయడం దారుణమన్నారు కేసీఆర్‌ కుటుంబానికి 2014లో, ఇప్పుడున్న ఆస్తులు..రాష్ట్రప్రభుత్వ అప్పులపై వేర్వేరు శ్వేతపత్రాలు విడుదల చేయాలన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని