సంక్షిప్త వార్తలు(12)

విజయవాడకు చెందిన అఖిల భారత కాపు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాబత్తుల శ్రీనివాస్‌.. భారాస తీర్థం పుచ్చుకున్నారు.

Updated : 03 Feb 2023 06:16 IST

భారాసలో చేరిన మాసాబత్తుల శ్రీనివాస్‌

గాంధీనగర్‌, న్యూస్‌టుడే : విజయవాడకు చెందిన అఖిల భారత కాపు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాబత్తుల శ్రీనివాస్‌.. భారాస తీర్థం పుచ్చుకున్నారు. గురువారం హైదరాబాద్‌లో భారాస ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కేసీఆర్‌ నాయకత్వంలో ఏపీలో పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా శ్రీనివాస్‌ తెలిపారు.


రాజ్యాంగం గురించి ఆనం తెలుసుకోవాలి
నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి

నెల్లూరు, న్యూస్‌టుడే: తాను రాజ్యాంగేతర శక్తినంటూ విమర్శించిన ఆనం రామనారాయణరెడ్డి ముందు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని ఏపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌, తిరుపతి జిల్లా వైకాపా సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఆత్మకూరు ఇన్‌ఛార్జిగా ఉన్న సమయంలో ఆయన రాజ్యంగ విలువలను ఏ విధంగా అపహాస్యం చేశారో గుర్తు చేసుకోవాలన్నారు. తెదేపా నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లే యత్నం చేశారని విమర్శించారు. వెంకటగిరి మున్సిపల్‌ కమిషనర్‌గా తనకు అనుకూలమైన వారిని నియమించుకుని స్థానికేతరులకు కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై కోటంరెడ్డి ఆరోపించిన తర్వాత తన ఫోన్‌ కూడా ట్యాప్‌ చేస్తున్నారనడం విడ్డూరంగా ఉందన్నారు.


‘నెల్లూరు’ వెనుక ‘ఒంగోలు’ నేత
బాలినేనిపై సుబ్బారావు గుప్తా విమర్శలు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: నెల్లూరు గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సహా అందరినీ విమర్శించారని., అదే సమయంలో మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదని ఆ పార్టీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అన్నారు. ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాలినేని సమన్వయకర్తగా ఉన్న జిల్లా నుంచే వైకాపాలో లుకలుకలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఇది సీఎం జగన్‌ గుర్తించాలన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది వైకాపా ఎమ్మెల్యేలు పార్టీని వీడి తెదేపాలో చేరటం వెనుక కూడా ఒంగోలు నాయకుల హస్తం ఉందని గుప్తా ఆరోపించారు. కేవలం వ్యాఖ్యలు చేస్తేనే నెల్లూరు జిల్లాలో ఇద్దరిని పదవుల నుంచి తొలగించారని, ఒంగోలులో తమ బంధువైన బాలినేనిపై మాత్రం చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.


కలసి వస్తే జనసేనతో.. లేకుంటే ఒంటరిగానే పోటీ
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

అరకులోయ, న్యూస్‌టుడే: రాబోయే ఎన్నికల్లో కలసి వస్తే జనసేన పార్టీతోను.. లేకుంటే ఒంటరిగానే పోటీచేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో గురువారం ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికల్లో వైకాపా, తెదేపాలకు భాజపా సమాన దూరంలో ఉంటుందన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కేవలం తొమ్మిది సంక్షేమ పథకాలనే అమలు చేస్తుంటే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 60 పథకాలతో ప్రజలను ఆదుకుంటోందని చెప్పారు.


వృద్ధిరేటులో మొదటి స్థానమని సీఎం చెప్పడం హాస్యాస్పదం
యనమల రామకృష్ణుడు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 11.43 శాతం వృద్ధి రేటుతో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని సీఎం జగన్‌ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో విమర్శించారు. స్థిర రేటు గణాంకాల ప్రకారం గత 4 ఏళ్లలో వృద్ధి రేటు మైనస్‌ 4 శాతానికి దిగజార్చారన్నారు. ‘స్థిర ధరల ప్రకారం జీఎస్‌డీపీ లెక్కించాలి. కానీ ప్రస్తుత ధరలతో లెక్కించి బోగస్‌ లెక్కలు చెప్పారు. గత నాలుగు ఏళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం ఎందుకు తగ్గింది? రూ.10 లక్షల కోట్ల అప్పులు ఎందుకు పెరిగాయి? సుస్థిర ఆర్థికాభివృద్ధి.. విదేశీ ప్రత్యేక పెట్టుబడుల్లో రాష్ట్రం 13వ స్థానానికి ఎందుకు దిగజారింది’ అని ప్రశ్నించారు.


డ్వాక్రా సంఘాలకు రుణ మాఫీ ఎప్పుడు?
తెదేపా నాయకురాలు ఆచంట సునీత

ఈనాడు, అమరావతి: డ్వాక్రా మహిళలకు నవంబరులో చెల్లించాల్సిన మూడో విడత రుణ మాఫీ మొత్తాన్ని ఇప్పటికీ చెల్లించలేదని తెదేపా అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రూ.27వేల కోట్ల రుణాన్ని మాఫీ చేస్తానని హామీ ఇచ్చి.. రెండేళ్లలో రూ.12 వేల కోట్లు మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు.


అవమానపరిస్తే సహించం: ఎమ్మెల్సీ

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని చులకన చేసేలా కొందరు అధికారులు ప్రవర్తిస్తున్నారని,  అలాంటివి సహించబోమని ఎమ్మెల్సీ రఘువర్మ హెచ్చరించారు. ఏపీటీఎఫ్‌ ఉప కమిటీ సమావేశాన్ని గురువారం అధ్యక్షురాలు మంజుల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉపాధ్యాయ వృత్తి పవిత్రతను నాశనం చేసేలా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ వ్యవహరిస్తున్నారు. ఇది సరైన విధానం కాదు’ అని అన్నారు.


ఆ వ్యాఖ్యలకు మహిళలు, శూద్రులే బాధను అనుభవిస్తారు
సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్‌మౌర్య

లఖ్‌నవూ: మతం ముసుగులో తమపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు మహిళలు, శూద్రులు మాత్రమే బాధను అనుభవించగలరని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్‌ మౌర్య పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓబీసీ నాయకుడైన మౌర్య ఇటీవల 16వ శతాబ్దానికి చెందిన రామ్‌చరిత్‌మాసన్‌ కావ్యంపై వ్యాఖ్యలు చేశారు. అందులోని శ్లోకాలు కులాల ఆధారంగా సమాజంలో అధిక సంఖ్యలో ఉండే వర్గాన్ని అవమానించాయని తెలిపారు. వాటిని నిషేధించాలని కోరారు. తాజాగా మళ్లీ అదే డిమాండ్‌ చేస్తూ.. అది నెరవేరే వరకూ ఈ అంశంపై తన ప్రచారాన్ని కొనసాగిస్తానని వెల్లడించారు. మహిళలు, శూద్రుల బాధను బ్రిటిషర్లు మహాత్మాగాంధీని రైల్లో నుంచి నెట్టివేసినప్పటి పరిస్థితితో పోల్చారు. ‘భారతీయులు శునకాలు అంటూ రైలులో గాంధీని బ్రిటిష్‌వారు అవమానించిన తీరు, దురుసు ప్రవర్తన వల్ల ఆయనకు మాత్రమే బాధ కలిగింది. అదేవిధంగా మతం ముసుగులో స్త్రీలు, శూద్రులపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యల వల్ల కలిగే బాధ వారికి మాత్రమే తెలుస్తుంది’ అని మౌర్య ట్వీట్‌ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గత భాజపా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మౌర్య 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.


సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర: జనక్‌ప్రసాద్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: సింగరేణిని ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఐఎన్‌టీయూసీ నాయకుడు జనక్‌ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రైవేటీకరణ జరిగితే రాష్ట్రంలో సింగరేణి కనుమరుగవుతుందని, విద్యుత్‌ ఛార్జీలు పెరుగుతాయని.. ఫలితంగా చిన్న పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే బొగ్గును అదానీ సంస్థ నుంచి కొనాలని కేంద్రం ఆదేశాలిచ్చిందన్నారు. పార్లమెంట్‌లో కేంద్రం తీసుకువచ్చిన ‘ఎంఎండీఆర్‌’ చట్టానికి భారాస ఎంపీలు మద్దతిచ్చారని.. కేసీఆర్‌, మోదీ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.


కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి: గిడుగు రుద్రరాజు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఆయన గాంధీభవన్‌ ఆవరణలోని ఏపీ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్‌కు గురువారం వచ్చారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడు టి.కుమార్‌రావు, ప్రధాన కార్యదర్శి చల్లా నర్సింహారెడ్డి తదితరులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ.. తెలంగాణలోని 30-40 నియోజకవర్గాల్లో సీమాంధ్రుల ప్రభావం ఉంటుందని.. వారందరినీ సమీకరించి పార్టీ విజయం కోసం ఇక్కడి పీసీసీతో కలిసి పనిచేస్తానని చెప్పారు.


దిల్లీ మద్యం కేసులో కేంద్రం చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: దిల్లీ మద్యం కేసులో ఈడీ తాజా ఛార్జ్‌షీట్‌పై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్‌ చేశారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఎమ్మెల్సీ కవితల పేర్లు తాజా ఛార్జ్‌షీట్‌లో ఉన్నాయన్నారు. భారాస, ఆప్‌ నేతల మధ్య మద్యం లింకులున్నాయని బయటపడిందని.. అందుకే కేసీఆర్‌తో కేజ్రీవాల్‌ దోస్తీ చేస్తున్నారని విమర్శించారు.


నితిన్‌ గడ్కరీ ఇలాకాలో భాజపాకు ఎదురుదెబ్బ

నాగ్‌పూర్‌:  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సొంత నియోజకవర్గం నాగ్‌పుర్‌లో భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి భాజపా మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి నాగో గనార్‌ పరాజయం పాలయ్యారు. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి సుధాకర్‌ అడ్బాలే విజయం సాధించారు. ఆరెస్సెస్‌లోని పలువురు కీలక వ్యక్తులతోపాటు, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వారైనప్పటికీ వారి మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి పరాజయం పాలవడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు