Karnataka Elections: వన్స్‌మోరా.. కొత్తనీరా?

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు  అగ్నిపరీక్షకు తెరలేచింది. ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ల మధ్య కర్ణాటక వేదికగా రాజకీయ సంగ్రామం జరగబోతోంది.

Updated : 30 Mar 2023 09:34 IST

సార్వత్రికానికి ముందు భాజపా-కాంగ్రెస్‌లకు అగ్నిపరీక్ష
ఉనికి కోసం జేడీ (ఎస్‌) పాట్లు  
కర్ణాటక ఎన్నికలు రసవత్తరం

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు  అగ్నిపరీక్షకు తెరలేచింది. ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ల మధ్య కర్ణాటక వేదికగా రాజకీయ సంగ్రామం జరగబోతోంది. దక్షిణాదిలోని తమ ఏకైక అధికార పీఠమైన కర్ణాటకను కాపాడుకోవాలని భాజపా, ఎలాగైనా దాన్ని మళ్లీ ‘హస్త’గతం చేసుకోవాలని కాంగ్రెస్‌ హోరాహోరీ పోరాడనున్నాయి. జనతాదళ్‌ (ఎస్‌) కింగ్‌ మేకర్‌ పాత్ర కోసం తహతహలాడుతోంది. అధికారంలో ఉన్న పార్టీకి గత 38 ఏళ్లలో ఎన్నడూ కన్నడిగులు వరసగా రెండోసారి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. సంప్రదాయాన్ని కొనసాగించి ఈసారి కొత్తవారికి అవకాశమిస్తారా? లేదా అధికార భాజపాకే వన్స్‌మోరంటూ ఆమోదం తెలుపుతారా? అనేది తేలాలి. ఈసారి కాంగ్రెస్‌ 40.1% ఓట్లతో 115-127 మధ్య సీట్లు నెగ్గుతుందని, భాజపా 68-80 స్థానాలకు పరిమితం అవుతుందని ఏబీపీ న్యూస్‌-సీ వోటర్‌ ఒపీనియన్‌ పోల్‌ తాజాగా అంచనావేసింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌పై అనర్హత వేటుపడిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. త్రిముఖ పోరులో పార్టీల బలాబలాల్ని పరిశీలిస్తే...


భాజపా

చరిత్రకు ఎదురీత

దక్షిణ భారతంలో తమ తొలి అడుగును నిలబెట్టుకోవటానికి కమలనాథులు ఆపసోపాలు పడుతున్నారు. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినా పూర్తి మెజార్టీ రాని కమలనాథులు కాంగ్రెస్‌, జేడీ (ఎస్‌)ల నుంచి ఫిరాయింపులపై ఆధారపడి అధికారం నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పీఠాన్ని కాపాడుకోవటానికి కష్టపడుతున్నారు.

బలాలు: ప్రధాని నరేంద్రమోదీ ఆకర్షణ. కేంద్ర ప్రభుత్వ అండ. కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు, ఆ పార్టీ అధిష్ఠానం బలహీనతలు.'

బలహీనతలు: బలమైన స్థానిక నాయకత్వం లేకపోవటం. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు. కేంద్ర ప్రభుత్వ ఆకర్షణపైనే అతిగా ఆధారపడటం. ప్రతి పనిలోనూ 40శాతం ముడుపులు తప్పడం లేదనే ఆరోపణలు.  


కాంగ్రెస్‌

చిగురిస్తామని ఆశ

కర్ణాటకలో కాంగ్రెస్‌ నెగ్గితే అది దేశవ్యాప్తంగానూ ఆ పార్టీలో జవజీవాలు నింపుతుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం ఇది. కర్ణాటకలో మెరుగైన అవకాశమే ఉందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. కన్నడిగులు ప్రతిసారీ మార్పును కోరుకోవడం వారిలో ఆశలు పెంచుతోంది.

బలాలు: డి.కె.శివకుమార్‌, సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గేలాంటి వారి రూపంలో స్థానికంగా, ఆర్థికంగా సమర్థులైన నేతలున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ పార్టీ కేడర్‌ బలంగా ఉంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, గృహిణులకు నెలకు రూ.2వేల సాయం, నిరుద్యోగులకు రూ.3వేల భృతిలాంటి ఆకర్షణీయ హామీలు.

బలహీనతలు: నాయకులకు ఒకరంటే ఒకరికి పడదు. శివకుమార్‌, సిద్ధరామయ్య వర్గాలది బహిరంగ పోరాటమే. రాష్ట్రంలో బలమైన లింగాయత్‌ వర్గంలోకి చొచ్చుకొని వెళ్లలేకపోవటం. బలహీనమైన అధిష్ఠానం.


జేడీ (ఎస్‌)

హంగు రావాలని.. కింగ్‌ కావాలని..

ఇప్పటిదాకా జనతాదళ్‌(ఎస్‌) ఎన్నడూ సొంతంగా అధికారంలోకి రాలేదు. మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబ పార్టీగా పేరొందిన ఇది పూర్తిగా ఆయన కుమారుడు కుమారస్వామి సారథ్యంలోనే నడుస్తోంది. భాజపా, కాంగ్రెస్‌ల మద్దతుతో రెండుసార్లు సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కుమారస్వామి ఈసారి కూడా కింగ్‌మేకర్‌ పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. మళ్లీ హంగ్‌ రావాలని... ప్రభుత్వ ఏర్పాటులో తమది కీలకపాత్ర కావాలన్నదే దేవెగౌడ, కుమారస్వామిల ఆశ.

బలాలు: వొక్కళిగ వర్గం మద్దతు. కన్నడ అస్థిత్వంతో కూడిన ప్రాంతీయ పార్టీ అనే పేరు. గ్రామీణ ప్రాంతాల్లో, రైతుల్లో మంచిపేరు.

బలహీనతలు: కుటుంబం చుట్టూనే పార్టీ రాజకీయమంతా తిరగటం. దేవెగౌడ కుటుంబానికి చెందిన 8 మంది రాజకీయాల్లో ఉండడం. మైసూరు ప్రాంతాన్ని మించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించలేకపోవటం. చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేరు. నెగ్గే అభ్యర్థులు ఇతర పార్టీలవైపు చూడరనే నమ్మకం లేదు.


లింగాయత్‌లది కీలకపాత్ర

ప్రధాన పక్షాలైన భాజపా, కాంగ్రెస్‌, జేడీ (ఎస్‌)లతో పాటు ఆప్‌, ఎంఐఎం, వామపక్షాలు, బీఎస్పీ, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష వంటివి కూడా బరిలోకి దిగుతున్నాయి. జనాభాలో లింగాయత్‌లు 17 శాతం; వొక్కళిగలు 15%, ఓబీసీలు 35శాతం, ఎస్సీ-ఎస్టీలు 18%, ముస్లింలు 12.9% ఉన్నారు. లింగాయత్‌లు సుమారు 100 సీట్లలో ప్రభావం చూపుతారు. రాష్ట్రానికి 23 మంది ముఖ్యమంత్రులుగా చేయగా... వారిలో 10 మంది లింగాయత్‌లే. ఈ వర్గం ఎక్కువగా భాజపా పక్షాన నిలుస్తుందంటారు.


ప్రధానాంశాలు

పెరిగిన ధరలు, ప్రధాని మోదీ ఆకర్షణ తదితరాలతో పాటు కొన్ని అంశాలు ఈసారి కర్ణాటక ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. అవి...

1. అవినీతి

ప్రస్తుత భాజపా సర్కారుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కమీషన్ల సర్కారుగా అన్నివర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.

2. రిజర్వేషన్లు

ముస్లింలకున్న 4శాతం ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసి వాటిని వొక్కళిగ, లింగాయత్‌లకు ప్రభుత్వం కేటాయించింది. దళితుల్లో వర్గీకరణకు కర్ణాటక భాజపా సాహసం చేసింది.

3. ఉచితాలు

గృహిణులకు నెలకు రూ.2వేలు, నిరుద్యోగులకు రూ.3వేల భృతిలాంటి భారీస్థాయి ఉచిత హామీలను కాంగ్రెస్‌ ప్రకటించింది.

4. స్పష్టమైన ఆధిక్యం

గత ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవటంతో రాష్ట్రంలో రాజకీయం, పాలన అస్తవ్యస్తమైంది. అందుకే ఈసారి ఇది ప్రధానాంశం కాబోతోంది.

ఈనాడు ప్రత్యేక విభాగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు