పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను

వైతెపాను ఎందులోనూ విలీనం చేయనని, ఏ ఇతర పార్టీలతోనూ పొత్తులు ఉండబోవని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల స్పష్టం చేశారు.

Published : 02 Jun 2023 03:49 IST

కేసీఆర్‌కు పది ప్రశ్నలు సంధిస్తూ గోడపత్రిక ఆవిష్కరించిన షర్మిల

నారాయణగూడ, న్యూస్‌టుడే: వైతెపాను ఎందులోనూ విలీనం చేయనని, ఏ ఇతర పార్టీలతోనూ పొత్తులు ఉండబోవని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి గురువారం ఆమె నివాళి అర్పించారు. దశాబ్ది ఉత్సవాలు చేసే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తూ గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. ‘మీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నారని, మీకు ఏపీ పీసీసీ చీఫ్‌ లేదా రాజ్యసభ అవకాశం ఇస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది నిజమేనా’ అని మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించారు. షర్మిల స్పందిస్తూ.. ‘రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా కేసీఆర్‌ ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌ పార్టీ కేసీఆర్‌ మోచేతి నీళ్లు తాగుతుంటే.. భాజపా ఆయనతో డ్యూయెట్లు పాడుతోంది. మేమే కదా ప్రజల పక్షాన నిలబడి అడుగడుగునా కేసీఆర్‌ను ప్రశ్నిస్తోంది. మా పార్టీని ఇంకో దానిలో విలీనం చేయడానికి నేను ఇంత కష్టపడాలా..? నేను ఏదైనా పార్టీలో చేరతానంటే ఎవరైనా వద్దంటారా..? మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. పొత్తులపై అన్ని పార్టీలు పరస్పరం మాట్లాడుకుంటాయి. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కేసీఆర్‌కు వేసినట్లే అనుకుంటున్నప్పుడు అలాంటి పార్టీతో పొత్తు అవసరమా’ అని షర్మిల ప్రశ్నించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు