YS Sharmila: కాంగ్రెస్‌లో వైతెపా విలీనంపై కొలిక్కి రాని షర్మిల ప్రయత్నాలు

కాంగ్రెస్‌లో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) విలీనానికి ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కిరాలేదు.

Updated : 18 Aug 2023 10:00 IST

ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌లో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) విలీనానికి ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కిరాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. వైతెపాను కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధిష్ఠానంలోని ముఖ్యులతో ఆమె, భర్త అనిల్‌ కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నారు. గత రెండు రోజుల్లోనూ ఇదే పనిపై షర్మిల దిల్లీలో ఉన్నారు. ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, సంబంధిత వ్యవహారాల్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలు నిమగ్నమవడంతో గురువారం షర్మిలకు వారి అపాయింట్‌మెంట్‌ లభించలేదు. శుక్రవారం ఉదయం ఆమె ఖర్గేను కలిశారు. కానీ తెలంగాణ పీసీసీ నాయకత్వంతో పాటు పలువురు బలహీన వర్గాలకు చెందిన నాయకులు ఆమె చేరికపై విముఖత చూపుతున్నారు. తెలంగాణ వ్యతిరేక వైఖరిని బాహాటంగా ప్రకటించిన వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కుమార్తెను పార్టీలో చేర్చుకుంటే ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోవడం ఖాయమని అధిష్ఠానానికి తేల్చిచెప్పారు. పార్టీని విలీనం చేసి ఆమె ఆంధ్రప్రదేశ్‌ను కార్యస్థలంగా ఎంచుకుంటే అక్కడ పార్టీ బలోపేతమవుతుందని, ఆమె ఆ రాష్ట్రంలో పనిచేస్తే తమకు ఇబ్బంది లేదని వారు వివరించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం సైతం షర్మిలకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. శుక్రవారం మధ్యాహ్నమే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోవడంతో విలీన చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో షర్మిల కూడా సాయంత్రం హైదరాబాద్‌ వెళ్లిపోయారు.

షర్మిలతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ కుమార్తె షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తానంటే ఆహ్వానిస్తామని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దిల్లీ నుంచి శుక్రవారం రాత్రి వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌కు ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలోనే ఎక్కువ అభిమానులు ఉన్నారన్నారు. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ఆస్తి అని.. ఆయన కుమార్తె షర్మిలతో కలిసి కాంగ్రెస్‌లో పనిచేయడం అదృష్టంగా భావిస్తామన్నారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌కు ఉన్న గౌరవం షర్మిలకు కూడా ఉంటుందన్నారు. వైతెపాను కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమెనే అడగాలని ఆయన సమాధానమిచ్చారు. ఇదే విమానంలో దిల్లీ నుంచి వచ్చిన షర్మిల మాత్రం విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని