జోరు పెంచిన కారు
వచ్చే నెల తొలి వారంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలుండడంతో.. విజయమే లక్ష్యంగా భారాస అధిష్ఠానం యత్నాలు ముమ్మరం చేసింది.
విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదును
మ్యానిఫెస్టో రూపకల్పనపై సీఎం కేసీఆర్ కసరత్తు
అసంతృప్తులతో మంత్రి కేటీఆర్ వరుస భేటీలు
స్టేషన్ ఘన్‌పూర్, జనగామ, మంథని, వేములవాడ నియోజకవర్గాల్లో నేతల మధ్య కుదిరిన సయోధ్య
త్వరలోనే మిగిలిన నాలుగు స్థానాలకూ అభ్యర్థుల ప్రకటన!
ఈనాడు- హైదరాబాద్, వరంగల్: వచ్చే నెల తొలి వారంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలుండడంతో.. విజయమే లక్ష్యంగా భారాస అధిష్ఠానం యత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయా అభ్యర్థులు మరింతగా ప్రజల్లోకి వెళ్లడానికి అవసరమైన కార్యాచరణలో వేగం పెంచింది. అక్టోబరు 16న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించనుంది. దీని రూపకల్పనపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారు. సీనియర్ నేతలతో వరుసగా భేటీ అవుతూ.. మ్యానిఫెస్టోలో పొందుపర్చాల్సిన ముఖ్యమైన అంశాలపై కసరత్తు చేస్తున్నారు. మరోవైపు అక్కడక్కడా నెలకొన్న అసంతృప్తులను సాధ్యమైనంత త్వరగా చల్లార్చడానికి పార్టీ అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన సమయంలో అమెరికా పర్యటనలో ఉన్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్.. అక్కడ నుంచి రాగానే అసంతృప్త నేతలను స్వయంగా కలుస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆయా నేతలను పిలిపించుకొని, నచ్చజెబుతున్నారు.
ఇందులో భాగంగా శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల అసంతృప్త నేతలతో వరుసగా కేటీఆర్ భేటీ అయ్యారు. స్టేషన్ ఘన్‌పూర్, జనగామ, వేములవాడ, మంథని తదితర నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య.. జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల మధ్య సయోధ్య కుదర్చడంలో ఆయన సఫలమైనట్లు తెలిసింది. కేటీఆర్‌తో భేటీ అనంతరం.. కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి పూర్తిగా సహకరిస్తానని తాటికొండ రాజయ్య ప్రకటించడం విశేషం. జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్ ఇస్తే తానూ సహకరిస్తానని ముత్తిరెడ్డి అంగీకరించినట్లు సమాచారం. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, ఆయన వర్గీయులనూ బుజ్జగించినట్లు తెలిసింది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ నేతల మధ్య సయోధ్య కుదరడంతో.. ఆయా చోట్ల పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు సమయం కేటాయించడానికి మార్గం సుగమమైందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ ప్రకటించని నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను కూడా త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపాయి.
అసంతృప్తులకు గౌరవప్రదమైన పదవులు
115 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆగస్టు 21న సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు. నర్సాపూర్‌లో ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌రెడ్డి స్థానంలో మాజీ మంత్రి, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో మదన్‌రెడ్డికే టికెట్ ఇవ్వాలని, ఇతరులకు ఇస్తే సహకరించబోమని, పార్టీకి రాజీనామా చేస్తామని ఆయన వర్గీయులు ఆందోళన చేపట్టారు. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి బదులు ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇస్తారనే ప్రచారం జరగడంతో.. అక్కడ కూడా తనకే మళ్లీ అవకాశం ఇవ్వాలని ముత్తిరెడ్డి పట్టుబట్టారు. ఇక స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బదులు కడియం శ్రీహరికి టికెట్‌ను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ విషయంలో అసంతృప్తితో ఉన్న రాజయ్య గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ స్థానంలో చల్మెడ లక్ష్మీనరసింహారావుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో.. రమేశ్ వర్గీయుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయనను వ్యవసాయరంగ సలహాదారుగా కేబినెట్ హోదా కల్పిస్తూ సీఎం నియమించారు. తద్వారా రమేశ్ వర్గీయుల్లో అసంతృప్తి తగ్గుతుందని భావించినా.. క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. దీంతో కేటీఆర్ రంగంలోకి దిగారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో చెన్నమనేని రమేశ్‌తో పాటు ఆయన ప్రధాన అనుచరులతో కేటీఆర్ భేటీ అయ్యారు.
‘‘చెన్నమనేని రాజేశ్వరరావు ప్రతిష్ఠకు భంగం కలగకుండా.. రమేశ్‌కు సముచిత స్థానం కల్పించాం. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తాం. రమేశ్‌ను సాంకేతికపరమైన కారణాలతోనే మార్చాల్సి వచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో మరోసారి భారాస ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అంతా కృషి చేయాలి. వేములవాడలో భారాస అభ్యర్థిని గెలిపించడంలో కలిసికట్టుగా పనిచేయాలి’’ అని కేటీఆర్ కోరినట్లు తెలిసింది. ఇందుకు రమేశ్ వర్గీయులు సమ్మతించినట్లు సమాచారం. జనగామ టికెట్ కోసం పోటీపడుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలతోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టికెట్ నిరాకరించడానికి కారణాలు వివరించినట్లు తెలిసింది. ఆయన స్థాయి తగ్గకుండా గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని ముత్తిరెడ్డికి కేటీఆర్ నచ్చజెప్పినట్లు సమాచారం. కేటీఆర్ అనునయించడంతో జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతిస్తానని ముత్తిరెడ్డి చెప్పినట్లుగా తెలిసింది. కేటీఆర్‌తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జనగామ నేతలు భేటీ అయ్యారు.
కడియం విజయానికి కృషి చేస్తా: రాజయ్య
ప్రగతిభవన్‌లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈసారి అవకాశం రానందువల్ల పార్టీ మారవద్దని, రాజయ్య భవిష్యత్తుకు పార్టీ అండగా ఉంటుందని, ఆయనకు రాష్ట్రస్థాయిలో గౌరవప్రదమైన పదవి ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం పల్లా వద్ద ఉన్న రైతుబంధు రాష్ట్ర అధ్యక్ష పదవిని రాజయ్యకు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం విజయం కోసం కృషి చేస్తానని రాజయ్య ప్రకటించారు. ‘‘పార్టీ నిర్ణయం మేరకు ఇక నుంచి శ్రీహరికి సహకరిస్తా. రాష్ట్రస్థాయి పదవి ఇస్తామని కేటీఆర్ నుంచి హామీ వచ్చింది’’ అని రాజయ్య ‘ఈనాడు’కు తెలిపారు. ‘‘మా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని కేటీఆర్ సూచించగా రాజయ్య అంగీకరించారు’’ అని కడియం తెలిపారు. తనకు సంపూర్ణ మద్దతు తెలిపిన రాజయ్యకు కడియం ధన్యవాదాలు తెలిపారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండాను మరోసారి ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
-
యూపీలో అపహరణ.. హైదరాబాద్‌లో అత్యాచారం
-
ఏపీకి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్‌పై ప్రశాంత్ నీల్ క్లారిటీ