Jagga Reddy: కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరమా కూలిపోవడానికి?: జగ్గారెడ్డి

‘కూలిస్తే కూలిపోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అనుకుంటున్నారా’ అని భారాస నేతలను ఉద్దేశించి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.

Updated : 09 Feb 2024 07:18 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ‘కూలిస్తే కూలిపోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అనుకుంటున్నారా’ అని భారాస నేతలను ఉద్దేశించి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం జరగడం లేదు. భారాసలోనే జరిగి తీరుతుంది. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవడానికి హరీశ్‌రావు సిద్ధంగా ఉన్నారు. 20 మంది భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. మాజీమంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి రావొచ్చు. రాజకీయంగా మీరు నేర్పిన విద్యనే.. ఆ దారిలోనే మేమూ ప్రయాణం చేస్తున్నాం. కాంగ్రెస్‌ ప్రభుత్వమేమీ నాసిరకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదు’’ అని వ్యాఖ్యానించారు. తనను మించిన వారు లేరని కామారెడ్డిలో పోటీచేసిన కేసీఆర్‌ ఎందుకు ఓడిపోయారో మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి చెప్పాలన్నారు. సంగారెడ్డిలో హరీశ్‌రావు రూ.60 కోట్లు పంచారని ఆరోపించారు. ‘‘కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఏనాడైనా ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా వెళ్లి కలిశారా? అదే కాంగ్రెస్‌లో ఎవరైనా వెళ్లి సీఎంను కలిసే అవకాశం ఉంది’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని