Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్ల కొత్త రూల్‌.. జాయింట్‌ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!

Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Published : 01 May 2024 15:01 IST

Mutual Funds | ముంబయి: సంయుక్తంగా నిర్వహించే మ్యూచువల్ ఫండ్ (Mutual Funds) ఖాతాలకు నామినీ ఎంపికను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐచ్ఛికం (Optional) చేసింది. ఈ పెట్టుబడి సాధనంలో మదుపు ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కమొడిటీ, విదేశీ పెట్టుబడుల పర్యవేక్షణకు ఒకే ఫండ్ మేనేజర్‌ ఉండటానికి ఫండ్‌ హౌస్‌లకు అనుమతించింది.

సెబీ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ మ్యూచువల్ ఫండ్ (Mutual Funds) నిబంధనలను సమీక్షించి, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. పై రెండు సిఫార్సులపై సెబీ విస్తృత సంప్రదింపులు జరిపింది. జాయింట్ హోల్డర్‌లకు నామినీ నిబంధనల సడలింపు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు తెలిపారు. ఎవరైనా ఒకరికి జరగకూడనిది జరిగిన సమయంలో నిధుల బదిలీ సహా ఇరత ప్రక్రియలు సులువవుతాయని వివరించారు. జీవించి ఉన్న సభ్యుడిని నామినీగా చేర్చడాన్ని ఈ నిబంధన అవకాశం కల్పిస్తుందన్నారు.

మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Funds) హోల్డర్లు నామినీని ఎంపిక చేయడం.. లేదా అవసరం లేదని తెలియజేయడాన్ని సెబీ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దానికి 2024 జూన్‌ 30ని గడువుగా విధించింది. లేదంటే గడువు తర్వాత నిధులను విత్‌డ్రా చేసుకోవడం కుదరదు. అయితే, తాజా ఉత్తర్వుల్లో జాయింట్‌ అకౌంట్ హోల్డర్లకు మాత్రం మినహాయింపునివ్వడం వల్ల పై నిబంధనలను సడలించినట్లయింది.

మరోవైపు గోల్డ్ ఈటీఎఫ్‌లు (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్), సిల్వర్ ఈటీఎఫ్‌లు, కమొడిటీ మార్కెట్‌లో పాల్గొనే ఇతర ఫండ్‌ల వంటి కమొడిటీ ఆధారిత ఫండ్‌లకు ప్రత్యేక మేనేజర్‌ను నియమించడం ఐచ్ఛికం అని సెబీ తెలిపింది. అలాగే, ఓవర్సీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ నిర్వహణకు సైతం విధిగా ఫండ్ మేనేజర్‌ను నియమించడం తప్పనిసరి కాదని తెలిపింది. దేశీయ, విదేశీ/కమొడిటీ ఫండ్ల కోసం ఒకే మేనేజర్‌ ఉండడం వల్ల నిర్వహణ వ్యయం తగ్గుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని