logo

నాన్న రాసిన మరణశాసనం.. ఒత్తిడికి తలొగ్గి కుటుంబాన్ని కడతేర్చి..

‘నా మానసిక పరిస్థితి బాగోలేదు. చాలా ఒత్తిడిలో ఉన్నా. అమ్మ, భార్య, పిల్లలంటే నాకు ప్రాణం. నేను చనిపోయాక వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా చేశానని’’ డాక్టర్‌ శ్రీనివాస్‌ తన ఫోన్‌లో వాయిస్‌ రికార్డు చేశారు.

Updated : 01 May 2024 11:54 IST

‘‘మా పలుకులే నీ ఆశ.. మా అడుగులే నీ శ్వాస.. చిరునవ్వులతో వెన్నంటి.. చితి వైపెలా విసిరావు?! మా మదిలో నేస్తమా.. మా జగతిన సమస్తమా.. మా కనుల చిరుదీపమా.. మా మోమెలా చిదిమావు?మా ఆశల యశస్సువి.. మా ఊహల ఉషస్సువి.. తొలి రాత నేర్పావే.. తల రాత చెరిపావే..? నీవంటే బాధ్యతని.. నీవుంటే భవితని.. నిత్యం తలచాము.. నిన్నే కొలిచాము.. కష్టాలు కమ్మేశాయని.. కన్నీళ్లు కుదిపేశాయని.. నిలవలేననుకున్నావా..?నిలువునా బలిగొన్నావా?

- నాన్న శ్రీనివాస్‌ చేతిలో చిన్నారులు శైలజ, శ్రీహన్‌ వేదన

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - పటమట: ‘‘నా మానసిక పరిస్థితి బాగోలేదు. చాలా ఒత్తిడిలో ఉన్నా. అమ్మ, భార్య, పిల్లలంటే నాకు ప్రాణం. నేను చనిపోయాక వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా చేశానని’’ డాక్టర్‌ శ్రీనివాస్‌ తన ఫోన్‌లో వాయిస్‌ రికార్డు చేశారు. తాను ఎంతో ప్రేమించే కుటుంబ సభ్యులను స్వయంగా చంపి, తానూ ప్రాణం తీసుకున్నారు. విజయవాడ నగరంలో మంగళవారం జరిగిన విషాద ఘటన చూపరులను కంటతడి పెట్టిస్తోంది. తన తర్వాత కుటుంబ సభ్యులకు సమస్యలు రాకుండా ఉండేందుకే చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చాలా కాలం వైద్యుడిగా పలు చోట్ల పనిచేశాక సొంతంగా ఆసుపత్రిని స్థాపించాలనే కలను సాకారం చేసుకోకుండానే మరణించారు. ఈ ప్రయత్నంలో అప్పులు కావడంతో తన స్నేహితులకు వాటా ఇచ్చారు. ఆసుపత్రిని ఆధునికీకరించి వైద్యసేవలు ఆరంభించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయినా అప్పుల భారం తగ్గక తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. దీంతో కుటుంబ సభ్యులను చంపి, తాను చనిపోవాలని నిర్ణయించుకుని, ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గాఢనిద్రలో ఉండగా మట్టుబెట్టారు. తన బంధువులకు కానీ, భార్య తరఫు బంధువులకు కానీ ఆర్థిక ఇబ్బందులను తెలపలేదు. తమకు కనీసం మాటమాత్రమైనా చెప్పి ఉంటే ఏదోలా అప్పులు తీర్చేవారమని భార్య ఉష తండ్రి కన్నీటిపర్యంతం అయ్యారు.

అక్కడక్కడే తిరిగిన జాగిలం

సమాచారం అందుకున్న సీపీ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దర్యాప్తుపై సిబ్బందికి సూచనలిచ్చారు. కుటుంబ సభ్యులు నలుగురిని మెడ వద్ద కోసే ముందు ముఖంపై దిండు అదిమి పెట్టి ఊపిరాడకుండా చేశాడా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. చంపేందుకు ఉపయోగించిన కత్తులను సమీప సూపర్‌మార్కెట్‌లో కొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు అక్కడి సీసీ టీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసు జాగిలం.. శ్రీనివాస్‌ ఇంటి నుంచి బయటకు వచ్చి.. ఎదురుగా ఉన్న ఇంట్లోకి వెళ్లి బయటకు వచ్చింది. తర్వాత రోడ్డు పక్కన నిలిపిన కారు వద్దకు వచ్చి మళ్లీ వెనుదిరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాల్లో దృశ్యాలు పరిశీలిస్తున్నారు. శ్రీనివాస్‌ కారులోని ల్యాప్‌టాప్‌లో పాస్‌వర్డ్‌ ద్వారా పోలీసులు అతని సెల్‌ఫోన్‌ తెరిచినట్లు సమాచారం.

(బంధువుల సమక్షంలో కారు తనిఖీ)


చాలా సౌమ్యుడు..
- డా.భగవాన్‌, స్నేహితుడు

శ్రీనివాస్‌, నేను 20 ఏళ్లుగా స్నేహితులం. ఇద్దరం కలసి గుంటూరు వైద్య కళాశాలలో చదువుకున్నాం. నిరుడు సొంతంగా శ్రీజ ఆసుపత్రి పేరుతో నిర్మాణం ప్రారంభించారు. ఆసుపత్రి నిర్వహణలో ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటితోనే చనిపోయాడని అనుకుంటున్నాం. కుటుంబాన్ని చంపాడంటే నమ్మలేక పోతున్నాం. శ్రీనివాస్‌ చాలా సౌమ్యుడు. ఎంబీబీఎస్‌ చదివేటప్పుడు ప్రతి ఒక్కరితో చాలా మర్యాదగా వ్యవహరించేవాడు.


ఒత్తిడిలో ఉన్నట్లు తెలియదు
- మాధవి, కుటుంబ స్నేహితురాలు

ఆర్థికంగా నష్టపోయినట్లు తెలుసు.. కానీ మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలియదు. శ్రీనివాస్‌ కుమార్తెకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మెడిసిన్‌ చదివే రోజుల్లో అందరితో కలిసి మెలిసి ఉండేవారు. శ్రీనివాస్‌ పరిస్థితి ముందుగా తెలిసి ఉంటే అండగా నిలబడేవాళ్లం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని