TDP: తిరుపతిలో భూమన భారీ కుంభకోణం!

తిరుపతి మాస్టర్‌ ప్లాన్‌ అమలులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, ఆయన తనయుడు, నగర డిప్యూటీ మేయర్‌ అభినయరెడ్డి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.

Updated : 21 Feb 2024 08:32 IST

టీడీఆర్‌ బాండ్ల పేరిట రూ.3 వేల కోట్లు హాంఫట్‌
తితిదే ఈవో ధర్మారెడ్డి వియ్యంకుడికి రూ.53 కోట్లు
తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపణలు

ఈనాడు, నెల్లూరు: తిరుపతి మాస్టర్‌ ప్లాన్‌ అమలులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, ఆయన తనయుడు, నగర డిప్యూటీ మేయర్‌ అభినయరెడ్డి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. అస్మదీయులకు లబ్ధి చేకూర్చేందుకు దొంగ జీపీఏలు సృష్టించి ప్రజాధనం దోచుకున్నారని దుయ్యబట్టారు. తాను నెల రోజుల క్రితమే టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌) బాండ్ల అక్రమాలను బయట పెట్టినప్పటికీ.. తండ్రీకొడుకులు నోరు మెదపలేదని గుర్తుచేశారు. నెల్లూరులోని తెదేపా కార్యాలయంలో ఆనం మంగళవారం మీడియాతో మాట్లాడారు. టీడీఆర్‌ బాండ్ల పేరిట జరిగిన అక్రమాలు అంటూ పలు ఆధారాలు చూపించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

విలువ నిర్ధారణలోనే అక్రమాలు

తిరుపతిలో 18 రోడ్లను విస్తరిస్తున్నామంటూ అక్కడ స్థలాలు కోల్పోయిన వారికి 375 టీడీఆర్‌ బాండ్లు ఇచ్చారు. వాటిలో సగానికి పైగా అక్రమమే. దొంగ జీపీఏలతో రిజిస్ట్రేషన్‌ చేసిన వాటికి, వివాదాస్పద భూములకూ బాండ్లు ఇచ్చారు. చాలావాటిపై నివాస ప్రాంతం కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నగరంలోనే కాకుండా రోడ్డు విస్తరణ చేపట్టే గ్రామీణ ప్రాంతాలను కూడా వాణిజ్య స్థలాలుగా పేర్కొన్నారు. నగర నడిబొడ్డున ఉన్న భూముల ధరలనే అక్కడా వర్తింపజేశారు. మొత్తం బాండ్ల విలువ రూ.4,052 కోట్లు కాగా, అయిన వారికి లబ్ధి చేకూర్చేలా అక్రమాలకు పాల్పడ్డారు.

ఇవిగో ఉదాహరణలు

  • కంచి రాము టీడీఆర్‌ బాండ్‌ నంబరు 0356. ఇతనికి ఇచ్చిన సొమ్ము రూ.61.02 కోట్లు. అసలు   ఆ భూమి రాముకు సంబంధించింది కాదని అప్పటి జేసీ బాలాజీ తేల్చారు. రెవెన్యూ కోర్టులో పెండింగ్‌లో ఉన్న భూమికి  టీడీఆర్‌ బాండ్లు ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటి? రాము కుటుంబంపై కేసులున్నాయని స్వయంగా చెప్పిన జేసీనే.. అతడికి రూ.61 కోట్లు ఎలా ఇచ్చారు? ఆ భూమి రాముది కాదని తేలితే ఏం చేస్తారు?
  • డి.మురళి పేరుతో ఉన్న టీడీఆర్‌ బాండ్‌ నంబరు 00062. ఇచ్చిన సొమ్ము రూ.13 కోట్లు. ఇతను 2020 ఫిబ్రవరి 14న ఈ స్థలాన్ని జీపీఏ చేసుకున్నారు. తహసీల్దారు, రిజిస్ట్రార్‌, ఆర్డీవో కలిసి చదరపు గజానికి రూ.10 వేల చొప్పున 793.76 చ.గజాల విలువ రూ.79.38 లక్షలుగా నిర్ణయించారు. ఇదే అధికారుల బృందం కొద్ది రోజుల్లోనే చ.గజం విలువ రూ.40 వేలకు పెంచారు. 14 నెలల తర్వాత రిజిస్ట్రార్‌ ఆ విలువ చాలదని, అది వాణిజ్య ప్రాంతమంటూ ఏకంగా రూ.1.60 లక్షలకు పెంచి బాండ్‌ జారీ చేశారు.
  • కె.వెంకటరమణారెడ్డి పేరుతో ఉన్న టీడీఆర్‌ బాండ్‌ నంబరు 00320పై రూ.53.72 కోట్లు చెల్లించారు. ఈయన తితిదే ఈవో ధర్మారెడ్డి వియ్యంకుడు. ఈ బాండ్‌ జారీలో భూమి విలువ కంటే బంధుత్వం విలువే బాగా పనిచేసింది. దీనిపై తిరుపతి కలెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఎటువంటి విచారణా జరపలేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని