TDP: ఆ ఆరు స్థానాలపై ఆచితూచి.. ఎవరికి ఇవ్వాలన్న సందిగ్ధంతోనే పెండింగ్‌

తెలుగుదేశం పార్టీ ఇంకా ఆరు శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. వాటిలో చీపురుపల్లి, భీమిలి, దర్శి, ఆలూరు, రాజంపేట, అనంతపురం అర్బన్‌ స్థానాలున్నాయి.

Updated : 23 Mar 2024 10:16 IST

తెదేపా అసెంబ్లీ టికెట్ల వ్యవహారం

ఈనాడు, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఇంకా ఆరు శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. వాటిలో చీపురుపల్లి, భీమిలి, దర్శి, ఆలూరు, రాజంపేట, అనంతపురం అర్బన్‌ స్థానాలున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు భీమిలి టికెట్‌ కేటాయించాలని అడుగుతున్నారు. చంద్రబాబు ఆయనను చీపురుపల్లి వెళ్లాలని చెబుతున్నారు. నిర్ణయం ఎటూ తేలకపోవడంతో ఈ రెండుచోట్లా అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో పడింది. తాజాగా శ్రీకాకుళం బదులుగా ఎచ్చెర్లను భాజపాకు కేటాయించడంతో... మరో మాజీమంత్రి కళా వెంకటరావు చీపురుపల్లి టికెట్‌ అడుగుతున్నారు. చీపురుపల్లికి ఆయన పేరూ పరిశీలనలో ఉంది. మరోపక్క నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో... అక్కడ తెదేపా ఇన్‌ఛార్జిగా ఉన్న బంగార్రాజు పేరును భీమిలికి పార్టీ అధినాయకత్వం పరిశీలించింది. ఆయా స్థానాల అంశం గంటా, కళా వెంకటరావు, బంగార్రాజుల మధ్య తిరుగుతుండటంతో నిర్ణయం పెండింగ్‌లో పడింది.

  • విజయనగరం లోక్‌సభ స్థానాన్ని భాజపా నుంచి తీసుకుని రాజంపేట ఇచ్చే అంశం తెదేపా పరిశీలనలో ఉంది. అదే జరిగితే విజయనగరం లోక్‌సభ స్థానానికి కళా వెంకటరావు పేరు పరిశీలించే అవకాశముంది.
  • ప్రకాశం జిల్లా దర్శి టికెట్‌ ఇస్తే పార్టీలోకి వస్తానని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు చెబుతున్నారు. కానీ ఆయనపై పార్టీలోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. దర్శి నుంచి శిద్దా కోడలి పేరు పరిశీలనలో ఉంది.
  • కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ స్థానానికి వీరభద్రగౌడ్‌తో పాటు వైకుంఠం మల్లికార్జున, ఆయన సోదరుడి భార్య జ్యోతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
  • అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్‌ ఇస్తామన్న ప్రతిపాదనతో... జగన్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం పదవికి రాజీనామా చేసి తెదేపాలో చేరారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌తో పాటు, యాదవ సామాజికవర్గానికి చెందిన మరో నాయకుడి పేరూ పరిశీలిస్తున్నారు. గుమ్మనూరుకే ఎక్కువ అవకాశాలున్నట్టు సమాచారం.
  • అనంతపురం అర్బన్‌ టికెట్‌కి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరితో పాటు, మరికొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు.
  • అన్నమయ్య జిల్లా రాజంపేట టికెట్‌ కోసం చెంగల్రాయుడు, జగన్మోహన్‌రాజు పోటీ పడుతున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని