ప్రజలకు తాగునీరైనా ఇవ్వండి

పంటలకు సాగునీళ్లు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజలకు కనీసం గొంతు తడుపుకోవడానికి మంచినీళ్లయినా ఇవ్వాలని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Published : 18 Apr 2024 04:00 IST

ప్రభుత్వానికి హరీశ్‌రావు వినతి

ఈనాడు, హైదరాబాద్‌: పంటలకు సాగునీళ్లు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజలకు కనీసం గొంతు తడుపుకోవడానికి మంచినీళ్లయినా ఇవ్వాలని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యలపై ‘ఎక్స్‌’ వేదికగా బుధవారం ఆయన స్పందించారు. ‘‘రాష్ట్రం గొంతెండిపోతోంది. గుక్కెడు మంచి నీళ్ల కోసం ప్రజలు రోడ్లెక్కుతున్నారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు. పదేళ్ల కేసీఆర్‌ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశ్యాలు ఎప్పుడూ కనిపించలేదు. మారుమూల తండాల్లోనూ మిషన్‌ భగీరథ జలధార సమృద్ధిగా వచ్చేది. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలపై ప్రభుత్వం సత్వరమే దృష్టిపెట్టాలి’’ అని హరీశ్‌రావు కోరారు.

ప్రశాంత్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆసుపత్రి పాలైన 24 మందిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో చదువుకుంటున్న పేద బిడ్డల సంక్షేమం గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కనీస ఆలోచన లేదని విమర్శించారు. ప్రశాంత్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని దీనికి పూర్తి బాధ్యత వహించి వారి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ‘ఎక్స్‌’ వేదికగా బుధవారం ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని