Presidential Election: మళ్లీ కలుద్దాం..!

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ప్రతిపక్షాల సమావేశం సశేషంగా ముగిసింది. ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విముఖత చూపడంతో అందరికీ ఆమోదయోగ్యమైన మరోఅభ్యర్థి కోసం అన్వేషించాలని నిర్ణయించారు.

Updated : 16 Jun 2022 07:24 IST

 రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి శరద్‌ పవార్‌ విముఖత

ఉమ్మడి అభ్యర్థిపై కొలిక్కిరాని విపక్షాల కసరత్తు

20, 21 తేదీల్లో మరోసారి భేటీ

ఏకాభిప్రాయ సాధనకు త్రిసభ్య కమిటీ

ఈనాడు, దిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ప్రతిపక్షాల సమావేశం సశేషంగా ముగిసింది. ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విముఖత చూపడంతో అందరికీ ఆమోదయోగ్యమైన మరోఅభ్యర్థి కోసం అన్వేషించాలని నిర్ణయించారు. బుధవారం దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో పశ్చిమబెంగాల్‌ సీఎం, టీఎంసీ అధ్యక్షురాలు మమతాబెనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన భేటీకి 17 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ పేరును అన్ని పార్టీల సమ్మతితో మమతాబెనర్జీ ప్రతిపాదించినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీంతో మోదీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థల విధ్వంసాన్ని అడ్డుకోవడానికి రాజ్యాంగ విలువలను సంరక్షించగల వ్యక్తిని రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నిలబెట్టాలని తీర్మానించారు. అటువంటి అభ్యర్థి ఎంపిక బాధ్యతను శరద్‌పవార్‌, మమతా బెనర్జీ, మల్లికార్జున ఖర్గేలకు అప్పగించారు.

ఇదీ తీర్మాన సారాంశం...

సమావేశం రెండున్నర గంటల పాటు సాగింది. ఉమ్మడి అభ్యర్థి పేరు ఖరారు కానప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించాలన్న అభిప్రాయానికి నేతలు వచ్చారు. ‘75వ స్వాతంత్య్ర దినోత్సవ సంవత్సరంలో జరుగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో... నిజమైన రాజ్యాంగ సంరక్షకుడిగా వ్యవహరిస్తూ భారత ప్రజాస్వామ్యం, సామాజిక స్వరూపానికి నష్టం కలగకుండా నిలువరించగలిగే అభ్యర్థిని ఉమ్మడిగా నిలబెట్టాలని నిర్ణయించామ’ంటూ తీర్మాన ప్రతిని సుధీంద్ర కులకర్ణి విలేకరుల సమావేశంలో చదివి వినిపించారు. ఆయన భాజపా అగ్రనేత ఎల్‌.కె. ఆడ్వాణీ మాజీ వ్యూహకర్తగా గుర్తింపుపొందిన విషయం తెలిసిందే. విపక్ష నేతల భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మమతాబెనర్జీ, శరద్‌పవార్‌, టి.ఆర్‌.బాలు కూడా పాల్గొన్నారు.  భేటీ ప్రారంభమైన వెంటనే శరద్‌పవార్‌ పేరును మమతాబెనర్జీ ప్రతిపాదించారు. ఆయన నిరాకరించిన వెంటనే గోపాలకృష్ణ గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా పేర్లను ఆమె ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక్కడ పేర్లపై చర్చ కాకుండా ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తే బాగుంటుందని ఒమర్‌ అబ్దుల్లా సూచించినట్లు తెలిసింది. సమయాభావం కారణంగా ఈ సమావేశానికి పలువురు ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులు హాజరుకాలేని పరిస్థితి ఉన్నందున అందరితో చర్చించి ఒక అభిప్రాయానికి రావడానికి సంప్రదింపుల ప్రక్రియ చేపట్టాలనుకున్నారు. అందరితో చర్చించడంతో పాటు తదుపరి కార్యాచరణ ఖరారు బాధ్యతను మమతాబెనర్జీ, శరద్‌పవార్‌, మల్లికార్జున ఖర్గేలకు అప్పగించాలని నిర్ణయించారు. ఏకాభిప్రాయం సాధించిన అనంతరం ఈ నెల 20-21 తేదీల్లో మరోసారి ముంబయి లేదా దిల్లీల్లో ఎక్కడోచోట సమావేశమై అభ్యర్థి పేరును ప్రకటించాలన్న అభిప్రాయానికి వచ్చారు. సమావేశానికి హాజరుకాని ముఖ్యమంత్రులు కేసీఆర్‌, ఉద్దవ్‌ఠాక్రే, అరవింద్‌ కేజ్రీవాల్‌, నవీన్‌ పట్నాయక్‌, భగవంత్‌మాన్‌, హేమంత్‌సోరెన్‌, పినరయి విజయన్‌, ఎంకే స్టాలిన్‌ల వద్దకు కీలక నేతలను పంపి వ్యక్తిగతంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్‌తో కలిసి వేదికను పంచుకోవడం ఇష్టంలేక తెరాస, ఆప్‌, శిరోమణి అకాళీదళ్‌, బీజేడీల నేతలు ఈ సమావేశానికి రాలేదన్న అభిప్రాయం ఉంది. అందువల్ల వారితోనూ వ్యక్తిగతంగా మాట్లాడి సమ్మతి తీసుకున్న తర్వాత ఉమ్మడి అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పటిలోగా ఎన్డీయే అధికారికంగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నందున తదనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చన్న భావన కూడా ప్రతిపక్షాల్లో ఉంది.

తెలుగు రాష్ట్రాల పార్టీలు దూరం

ప్రతిపక్షాల సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఒక్క పార్టీ కూడా పాల్గొనలేదు. మమతాబెనర్జీ ఆహ్వానించని కారణంగా తెదేపా, ఎంఐఎంలు దూరంగా ఉన్నాయి. రాజకీయ కారణాల వల్ల తెరాస గైర్హాజరైంది. కేసీఆర్‌ లేదా పార్టీ ప్రతినిధులు ఎవరైనా వస్తారన్న ఉద్దేశంతో తెరాస కార్యకర్తలు కేసీఆర్‌కు ఆహ్వానం పలుకుతూ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ ముందు పెద్ద హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. రావడంలేదన్న విషయం తెలిసి దాన్ని తొలగించారు. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో బీఎస్పీ కూడా భేటీకి రాలేదు. మాయావతిని మమతాబెనర్జీ ఆహ్వానించకపోవడమే అందుకు కారణం.

ఏపీ ముఖ్యమంత్రికి మమత ఆహ్వానం

బుధవారంనాటి ప్రతిపక్షాల సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కూడా మమతాబెనర్జీ ఆహ్వానించారు. దీనికి సంబంధించి ఆమె ఈ నెల 11న రాసిన లేఖ బుధవారం ప్రత్యక్షమైంది. ‘‘మన దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన, సమర్థమైన ప్రతిపక్షం అవసరం. ఈ రోజు దేశాన్ని పట్టిపీడిస్తున్న విభజన శక్తులను అడ్డుకోవడానికి అన్ని ప్రగతిశీల పార్టీలూ కలిసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.  ఇందుకోసం ఈ నెల 15న దిల్లీలో జరిగే సమావేశానికి మీరు రావాల’’ని ఆ లేఖలో మమతాబెనర్జీ పేర్కొన్నారు. అయితే, తృణమూల్‌ కాంగ్రెస్‌ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్న 22 పార్టీల నేతల పేర్లలో జగన్‌మోహన్‌రెడ్డి పేరు కనిపించకపోవడంతో ఆయనను ఆహ్వానించలేదేమోనని అందరూ భావించారు. అయితే, ఆహ్వాన లేఖ ప్రత్యక్షం కావడంతో రాజకీయ కారణాల వల్ల జగన్‌మోహన్‌రెడ్డి రాలేదేమోనన్న భావన వ్యక్తమైంది.


హాజరైన పార్టీలు

కాంగ్రెస్‌,టీఎంసీ, ఎస్పీ, ఎన్సీపీ,  డీఎంకే, ఆర్జేడీ, శివసేన, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్‌), నేషనల్‌కాన్ఫరెన్స్‌, పీడీపీ, జేడీ(ఎస్‌), ఆర్‌ఎస్పీ, ఐయూఎంఎల్‌, ఆర్‌ఎల్డీ, జేఎంఎం.


గైర్హాజరైనవి

తెరాస, వైకాపా, ఆప్‌, బీజేడీ, శిరోమణి అకాలీదళ్‌, సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని