Ayyanna patrudu: అయ్యన్న ఇంటికి ఫెన్సింగ్‌ ఏర్పాటుకు హైకోర్టు అనుమతి

అధికారులు ప్రహరీని కూల్చిన స్థానంలో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకునేందుకు తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులకు హైకోర్టు

Updated : 12 Oct 2022 12:13 IST

కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులకు ఆదేశం

ఈనాడు, అమరావతి: అధికారులు ప్రహరీని కూల్చిన స్థానంలో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకునేందుకు తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులకు హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. 300 మంది పోలీసులను మోహరించి, ఆ సమయంలో కూల్చివేత చేపట్టడం వల్ల పిటిషనర్లు వ్యథకు గురయ్యారని వ్యాఖ్యానించింది. ప్రహరీ కూల్చడంతో పిటిషనర్లు, వారి కుటుంబసభ్యులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఫెన్సింగ్‌ ఏర్పాటుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న నర్సీపట్నం ఆర్డీవో, తహసీల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, అనకాపల్లి జిల్లా కలెక్టర్‌, తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు వేయాలని ఆదేశించింది. విచారణను జులై మొదటి వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. నర్సీపట్నంలోని తమ ఇంటి ప్రహరీ కూల్చివేతను నిలువరించాలని కోరుతూ తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్‌, రాజేష్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయగా... కూల్చివేతను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. బుధవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపిస్తూ.. ‘రెవెన్యూ, జలవనరులశాఖ అధికారులు పర్యవేక్షణ అనంతరం, వారి ఆమోదం మేరకు నిర్మాణం జరిగింది. రాజకీయకక్షతో ఏకపక్షంగా కూల్చివేశారు. ప్రహరీ నిర్మాణానికి అనుమతివ్వాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలి...’ అని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ పరిహారం, బాధ్యులైన అధికారులపై చర్యల విషయంలో ప్రత్యేకంగా అనుబంధ పిటిషన్లు వేసుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖ జీపీ వాదనలు వినిపిస్తూ.. స్థల వివాదంలో ఉమ్మడి సర్వే నిర్వహించాలని పిటిషనర్‌ కోరారని, వారి సమక్షంలో సర్వేకు అనుమతించాలన్నారు. ఆ అభ్యర్థనపై న్యాయవాది వీవీ సతీష్‌ అభ్యంతరం చెబుతూనోటీసు ఇవ్వకుండా గోడను కూల్చేసి ఇప్పుడు సర్వే చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని