Updated : 05 Jul 2022 07:22 IST

సింగిల్‌ ఇంజిన్‌కే స్పీడెక్కువ

డబుల్‌ ఇంజిన్‌ డొక్కుడొక్కయింది
ప్రధాని మోదీవి ఉత్తుత్తి ముచ్చట్లే
భాజపా నేతలు తెలంగాణపై విషం చిమ్మారు: మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో భాజపా డబుల్‌ ఇంజిన్‌ డొక్కుడొక్కవుతోందని, తెలంగాణలో సింగిల్‌ ఇంజిన్‌ వేగంగా దూసుకెళ్తూ అగ్రస్థానంలో నిలుస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట భాజపా నేతలు తెలంగాణపై మరోసారి విషం చిమ్మారని, చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెప్పి విసుగెత్తించారన్నారు. ప్రధాని సైన్స్‌హబ్‌ పేరిట చెప్పినవి ఉత్తముచ్చట్లేనని పేర్కొన్నారు. అమిత్‌షా అవగాహన లేకుండా మాట్లాడి స్థాయిని తగ్గించుకున్నారని, తప్పుగా రాసిచ్చిన స్క్రిప్టును చదివారని ఎద్దేవా చేశారు. సోమవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.‘‘ భాజపాకు అధికార యావ తప్ప దేశం మీద, తెలంగాణ మీద ఏ మాత్రం ప్రేమ లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నా దేశానికి గానీ, సమావేశాలకు ఆతిథ్యమిచ్చిన తెలంగాణకు గానీ మేలు చేయడం గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రధాని మహిళల గురించి గొప్పగా చెప్పారు. మరి మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని ఎందుకు తీసుకురావట్లేదు? రూ.1,050గా ఉన్న సిలిండర్‌ ధరను తగ్గిస్తామని ఎందుకు చెప్పలేదు? ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి సాధించిందేమీ లేదు. ఇప్పుడు తెలంగాణలోనూ అధికారం కావాలి అని అత్యాశతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చీరాని తెలుగులో నిధులు, నీళ్లు, నియామకాలు అని మాట్లాడారు. భాజపా కార్యకర్తలను అడిగితే తెలియదు. రైతులను అడిగితే చెబుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అపర భగీరథునిలా ప్రపంచంలోనే పెద్దదైన ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. కాళేశ్వరం నీళ్ల ద్వారా తెలంగాణ సస్యశ్యామలమైంది. కేసీఆర్‌ కృషితో గోదావరి, కృష్ణా జలాలు ఇక్కడి బీడు భూముల్లో పారాయి. పాలమూరు లాంటి జిల్లాలు పచ్చలహారంగా మారాయి. పంట ఉత్పత్తులు 60 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 2.60 కోట్ల మెట్రిక్‌ టన్నులకు చేరాయి. రూ.లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీళ్లు రానిదే ధాన్యం ఎలా వచ్చింది? మీరెలా కొన్నారు? తెలంగాణ ఇప్పటికే 1.35 లక్షల ఉద్యోగాలిచ్చింది. మరో 91 వేలను భర్తీ చేస్తున్న విషయం షా తెలుసుకోవాలి. దేశంలో ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి.

తెలంగాణకు నీళ్లు రాకుండా బోర్డులు వేశారు

తెలంగాణకు నీళ్లు రాకుండా గండికొట్టేందుకు కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులను వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి లేదని ఒక కేంద్రమంత్రి పార్లమెంటులో చెప్పగా.. ఇక్కడ నడ్డా ఆ ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎం అని రాష్ట్రంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదు. కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులిస్తే మరింత అభివృద్ధి జరిగేది. ప్రధాని కొత్తగా ఏమైనా నిధులు ప్రకటిస్తారనుకుంటే నిరాశే మిగిలింది. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ 26 లక్షల కుటుంబాలకే పరిమితం. ఆరోగ్యశ్రీ మాత్రం 86 లక్షల కుటుంబాలకు అందుతోంది. కేసీఆర్‌ ఎవరో తెలియదని సంజయ్‌ అంటున్నారు. యావత్‌ దేశంలో కేసీఆర్‌ తెలియని వారు లేరు. తెలంగాణలో పచ్చటి పొలాలను.. మత్తడి దుంకుతున్న చెరువులను అడిగితే కేసీఆర్‌ ఎవరో చెబుతాయి’’ అని హరీశ్‌రావు చెప్పారు. సమావేశంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ప్రభుత్వ విప్‌లు రేగా కాంతారావు, గొంగిడి సునీత, ఎమ్మెల్సీ వీజీగౌడ్‌లు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని