కేసు ఉపసంహరించుకోకపోతే చంపేస్తామంటున్నారు

వైకాపా నాయకుల ఆగడాలు విశాఖపట్నంలో పెచ్చుమీరుతున్నాయి. వైకాపా నాయకులు చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పెందుర్తి మండలం జెర్రిపోతులపాలేనికి చెందిన తెదేపా

Published : 15 Aug 2022 04:58 IST

వైకాపా నేతలపై తెదేపా కార్యకర్త ఫిర్యాదు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: వైకాపా నాయకుల ఆగడాలు విశాఖపట్నంలో పెచ్చుమీరుతున్నాయి. వైకాపా నాయకులు చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పెందుర్తి మండలం జెర్రిపోతులపాలేనికి చెందిన తెదేపా కార్యకర్త గల్లా శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా నాయకులు తనపై దాడికి ప్రయత్నిస్తున్నారని, ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పోలీసులను వేడుకున్నానని తెలిపారు. గతంలో జరిగిన సర్పంచి ఎన్నికల్లో వైకాపా మద్దతుదారుగా కోన శ్రీను పోటీచేసి ఓడిపోయారని.. అందుకు తానే కారణమని భావించి అప్పటినుంచి తనపై దాడికి ప్రయత్నిస్తున్నారన్నారు. గతేడాది ఆగస్టు 5న తన కారు అద్దాలు పగలగొట్టారని, కోన శ్రీను తన ఇంటి గేట్లు తన్ని అంతుచూస్తానని బెదిరించాడన్నారు. 2021 డిసెంబరు 26న పంచాయతీ వార్డు మెంబరు భర్త పాల అప్పారావు, ఆయన కుమారులు అప్పలరెడ్డి, రామ్‌కుమార్‌లు ఇనుపరాడ్డుతో తన తలపై గాయపరిచారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో వారిపై హత్యాయత్నం కేసు కాకుండా చిన్న కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం రామ్‌కుమార్‌కు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం రావడంతో ఆ కేసును ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారన్నారు. దీంతో జులై 29న పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోకపోవడంతో కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌, తహసీల్దారుకు ఫిర్యాదు చేశానన్నారు. తాను మరణిస్తే దానికి వైకాపా నాయకులే కారణమన్నారు. ఈ విషయమై పెందుర్తి సీఐ అశోక్‌కుమార్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ఇరు వర్గాలను పిలిపించి హెచ్చరించామని, విచారణ జరుగుతోందన్నారు. గల్లా శ్రీనివాసరావుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని