రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

హైదరాబాద్‌లో తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో తెరాస సెక్రటరీ జనరల్‌, ఎంపీ కేశవరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్‌, కార్మిక విభాగం నేత రూప్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల

Published : 16 Aug 2022 06:09 IST

హైదరాబాద్‌లో తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో తెరాస సెక్రటరీ జనరల్‌, ఎంపీ కేశవరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్‌, కార్మిక విభాగం నేత రూప్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చాలని ఈ సందర్భంగా కేశవరావు కోరారు.

* భాజపా కార్యాలయంలో పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సీనియర్‌ నాయకులు ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి పాల్గొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామంలో శ్రీసాయి ప్రశాంతి విద్యానికేతన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

* భాజపాలో ఒక్క స్వాతంత్య్ర ఉద్యమకారుడైనా ఉన్నారా? అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రశ్నించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శి నదీం జావెద్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, అజారుద్దీన్‌, నాయకులు షబ్బీర్‌అలీ, కుసుమకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్‌ నుంచి అబిడ్స్‌ నెహ్రూ విగ్రహం వరకు ఆజాదీ గౌరవ్‌ పాదయాత్ర నిర్వహించారు.

* ఎన్టీఆర్‌ భవన్‌లో తెలంగాణ తెదేపా ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నర్సింలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

* హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో జాతీయ పతాకాన్ని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని, చరిత్రను దొంగిలించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. సామాజిక సమానత్వం కోసం మరో సంపూర్ణ స్వాతంత్య్ర పోరాటం అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఎంబీ భవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

* నాంపల్లిలో తెజస అధ్యక్షుడు కోదండరాం జెండాను ఎగురవేశారు.

జిల్లాల్లో..: జగిత్యాల జిల్లా రాయికల్‌లో లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో రోడ్డుకిరువైపులా 75 జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. మానేరు నదిలో మత్స్యకారులు పడవలపై జెండా ఎగురవేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని