పోలీసు స్టేషన్‌ ఎదుటే తెదేపా నేతలపై హత్యాయత్నం

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు.

Updated : 28 Nov 2022 07:18 IST

అర్ధరాత్రి మారణాయుధాలతో దాడి
రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడి అనుచరుల దాష్టీకం
శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో ఉద్రిక్తత
జాకీ’ సంస్థ తరలిపోవడంపై పరస్పర ఆరోపణలతో ఘటన

ఈనాడు డిజిటల్‌- అనంతపురం, న్యూస్‌టుడే- చెన్నేకొత్తపల్లి: ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. చెన్నేకొత్తపల్లిలో పోలీసుస్టేషన్‌ ఎదుటే తెదేపా నాయకులపై హత్యాయత్నం చేశారు. మారణాయుధాలతో దాడి చేయడంతో ముగ్గురు తెదేపా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ కార్యకర్తను సమీపంలోని ఇంట్లోకి తీసుకెళ్లి చంపాలని ప్రయత్నించారు. అయితే టార్గెట్‌ చేసిన వ్యక్తి అతను కాదని వదిలేశారు. ఈ క్రమంలో తెదేపా నాయకుల కారును ధ్వంసం చేశారు. స్టేషన్‌ ఎదుటే హత్యాయత్నం జరిగినా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. వైకాపా నాయకులు అక్కడ్నుంచి వెళ్లిపోయే వరకూ పోలీసులు స్టేషన్‌ నుంచి బయటకు రాలేదు. వైకాపా మూక నుంచి తప్పించుకున్న వ్యక్తి ఫోన్‌ ద్వారా తెదేపా శ్రేణులకు తెలిపారు. తమ కార్యకర్తలపై దాడిని ఖండిస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం తెదేపా ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌, హిందూపురం పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో చెన్నేకొత్తపల్లి పోలీసుస్టేషన్‌ ఎదుట ఆదివారం ఉదయం ధర్నా నిర్వహించారు. పోలీసుల సహకారంతోనే తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని పరిటాల సునీత ధర్మవరం ఇన్‌ఛార్జి డీఎస్పీ హుస్సేన్‌ పీరాకు ఫిర్యాదు చేశారు.

ఇదీ నేపథ్యం..

తెదేపా ప్రభుత్వ హయాంలో రాప్తాడులో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన జాకీ సంస్థ ఇటీవల తెలంగాణకు వెళ్లిపోయింది. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి డబ్బులు డిమాండు చేయడంతోనే పరిశ్రమ వెళ్లిపోయిందని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ తెదేపా హయాంలోనే ఆ పరిశ్రమ వెళ్లిపోయిందంటూ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. అందులో తెదేపా అధినేత చంద్రబాబును పరుష పదజాలంతో దూషించారు. దీంతో శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురానికి చెందిన తెదేపా నాయకుడు కొండేటి అప్పస్వామి అలియాస్‌ జగ్గు ఓ వీడియోలో ఎమ్మెల్యే కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం అర్ధరాత్రి పోలీసులు జగ్గును చెన్నేకొత్తపల్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. జగ్గూ సోదరుడు సోమశేఖర్‌నాయుడు, అనుచరులు సాంబశివుడు, పోతులయ్య సొంత వాహనంలో స్టేషన్‌కు చేరుకున్నారు. జగ్గు స్టేషన్‌లో ఉన్న విషయం తెలిసిన ఎమ్మెల్యే మరో సోదరుడు రాజశేఖర్‌రెడ్డి అనుచరులు అక్కడికి చేరుకున్నారు. జగ్గు, ఆయన సోదరుడు ఒకే పోలికలతో ఉండటంతో సోమశేఖర్‌ నాయుడిని ఎత్తుకెళ్లి దాడిచేశారు. తర్వాత అతను జగ్గు కాదని తెలిసి వదిలేశారు. అనుచరులు సాంబ, పోతులయ్యపైనా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.

తెదేపా శ్రేణుల ధర్నా

ఈ ఘటనలకు నిరసనగా తెదేపా శ్రేణులు ఆదివారం ధర్నాకు దిగాయి. మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ ఆధ్వర్యంలో చెన్నేకొత్తపల్లి పోలీసుస్టేషన్‌ ముందు బైఠాయించారు. తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండు చేశారు. చెన్నేకొత్తపల్లి సీఐ చిన్నగౌస్‌, ఎస్సై శ్రీధర్‌ను సస్పెండ్‌ చేసేవరకూ కదిలేది లేదని తేల్చిచెప్పారు. ధర్మవరం డీఎస్పీ హుస్సేన్‌ పీరా వచ్చి బాధ్యులపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పోలీసుస్టేషన్‌ నుంచి తెదేపా శ్రేణులు బయటకు వస్తుండగా ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్‌రెడ్డి తన అనుచరులతో అక్కడికి రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం  నెలకొంది. 

* దాడిని నిరసిస్తూ ధర్నాలో పాల్గొనడానికి వస్తున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును పోలీసులు రాయదుర్గంలో అడ్డుకున్నారు. తెదేపా శ్రేణుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. రాయదుర్గం పట్టణ ఎస్‌ఐ సుమన్‌... తెదేపా కార్యకర్త పాలయ్య గొంతు నొక్కడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


ఇరువర్గాలపై కేసు నమోదు

30 పోలీసు చట్టం అమలులో ఉన్నప్పుడు వందల మందితో కలిసి పోలీసు స్టేషన్‌ ఎదుట ధర్నాచేశారనే కారణంతో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌, బీకే పార్థసారథితో పాటు మరో 100 మందిపై కేసు నమోదుచేశారు. దాడిపై బాధితుడు సాంబశివుడి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సోదరులు చంద్రశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డితో పాటు వైకాపా నాయకులు అమర్నాథ్‌రెడ్డి, ఎస్టీడీ శ్రీనివాస్‌రెడ్డి, రమణ తదితరులపై కేసు నమోదు చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు