YS Sharmila: షర్మిల నిరసన.. ఉద్రిక్తత

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం హైదరాబాద్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమం.. ఉద్రిక్తతకు దారితీసింది.

Updated : 30 Nov 2022 07:16 IST

దాడికి గురైన కారులో ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నం..
వాహనం దిగేందుకు ససేమిరా..
ఆమె కారులో ఉండగానే క్రేన్‌తో ఠాణాకు తీసుకెళ్లిన పోలీసులు
అరెస్టు చేసి న్యాయస్థానానికి తరలింపు..
బెయిలు మంజూరు

ఈనాడు, హైదరాబాద్‌ - ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, అబిడ్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, న్యూస్‌టుడే: వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం హైదరాబాద్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమం.. ఉద్రిక్తతకు దారితీసింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు టోయింగ్‌ వెహికిల్‌(క్రేన్‌) సాయంతో ఎస్‌.ఆర్‌.నగర్‌ ఠాణాకు తరలించే క్రమంలో ఆందోళన నెలకొంది. రోజంతా ఆందోళనల మధ్య చివరికి మంగళవారం రాత్రి షర్మిలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా బెయిలు లభించింది.

నర్సంపేటలో చోటుచేసుకున్న దాడి అనంతరం షర్మిలను సోమవారం రాత్రి పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తానని ఆమె ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను మంగళవారం ఉదయం గృహనిర్బంధం చేశారు. లోటస్‌పాండ్‌ వద్ద భద్రతను దాటుకొని ఏపీ సీఎం జగన్‌ నివాసం ద్వారా ఆమె బయటికి వచ్చారు. నంబరు ప్లేటులేని వాహనంలో సోమాజిగూడ యశోద ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అప్పటికే వైతెపా నాయకులు సోమవారం ధ్వంసమైన కారును అక్కడికి చేర్చగా షర్మిల అందులో ప్రగతిభవన్‌ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె వాహనం వెనుకే ధ్వంసమైన కారవాన్‌నూ తీసుకొచ్చారు. దీంతో పోలీసులు.. వాహనాలు, ఆటోలను అడ్డుగా ఉంచి ఆమెను కదలకుండా చేశారు. కారు నుంచి వెలుపలికి రావాలని విజ్ఞప్తి చేసినా ఆమె బయటకు రాలేదు. రాజ్‌భవన్‌ సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్‌ భారీగా పెరగడంతోపాటు వైతెపా కార్యకర్తల ఆందోళనతో మధ్యాహ్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

టోయింగ్‌ వాహనంలో తరలింపు..

ఎంత విజ్ఞప్తి చేసినా షర్మిలతోపాటు మరో ఇద్దరు నాయకులు కారు దిగేందుకు అంగీకరించలేదు. చివరికి వాహనాలను తరలించే క్రేన్‌కు ఆ కారును కట్టి ఎస్‌.ఆర్‌.నగర్‌ ఠాణాకు తరలించారు. అక్కడ కూడా ఆమె కారు నుంచి దిగలేదు. ఎయిర్‌పైప్‌తో కారు తలుపులోకి గాలిని పంపి లాఠీలతో డోర్లు తెరిచి ఆమెను అతికష్టంమీద స్టేషన్‌లోనికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, మీడియా ప్రతినిధులు, వైతెపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అక్కడికి వచ్చిన వారిని పోలీసులు చెదరగొట్టారు. సమీపంలో ఓ భవనంపైకి ఎక్కి నినాదాలు చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం బ్రదర్‌ అనిల్‌కుమార్‌ స్టేషన్‌కు వచ్చి షర్మిలను పరామర్శించారు. వాహనాలు ధ్వంసం చేసిన దుండగులపై కేసు పెట్టకుండా బాధితులపైనే పెట్టారని.. ఇది సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. ‘న్యాయపరంగా పోరాడతాం.. షర్మిల ఫైటర్‌.. తగ్గేదే లే..’ అని వ్యాఖ్యానించారు.

షర్మిల సహా ఏడుగురిపై కేసు.. బెయిలు

షర్మిల, ఆందోళనలో పాల్గొన్న మరో ఆరుగురిపై 2022 యూ/ఎస్‌ 143, 341, 290, 506, 509, 336, 353, 382 ఆర్‌/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిల వాహనాన్ని నిర్లక్ష్యంగా నడుపుతూ అడ్డుకోబోయిన తనను దాదాపు ఢీకొట్టేంత పనిచేశారని, ఇదంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుంటే అసభ్య పదజాలంతో దూషించారని పంజాగుట్ట ఎస్సై కె.అఖిల ఫిర్యాదు చేశారు. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్లు అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సై ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి నాంపల్లి 14వ చీఫ్‌ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో ఆమెతోపాటు మిగతావారిని హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం షర్మిలతోపాటు మరో ఆరుగురికి వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిలు మంజూరు చేసింది. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం పాదయాత్ర చేయాలని నాంపల్లి న్యాయస్థానం సూచించింది.

రాష్ట్రంలో గూండాల రాజ్యం: షర్మిల 

‘వైతెపా వాహనాల మీద దాడిచేసిన వారిని పట్టించుకోకుండా మమ్మల్నే అరెస్ట్‌ చేస్తారా’ అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. తన వల్ల ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని పేర్కొన్నారు. పోలీసులే సమస్యను తీవ్రం చేశారన్నారు. రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని.. అందరూ బందిపోట్లుగా మారారని ధ్వజమెత్తారు. గురువారం నుంచి పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టంచేశారు.

లోటస్‌పాండ్‌లో విజయమ్మ హౌస్‌ అరెస్ట్‌, నిరాహార దీక్ష

తన కుమార్తెను పరామర్శించేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుపడుతున్నారంటూ వైఎస్‌ విజయమ్మ లోటస్‌పాండ్‌లో నిరాహార దీక్షకు దిగారు. షర్మిలను అరెస్టు చేశారని తెలియడంతో ఠాణాకు వెళ్లేందుకు ఆమె సిద్ధమవగా శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆమెను గృహనిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా విజయమ్మ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘‘మైకు పెట్టి మాట్లాడమంటారా.. రాష్ట్రమంతటి నుంచి కార్యకర్తలను పిలవమంటారా.. అల్లర్లు చేయమంటారా.. బంద్‌లు, ధర్నాలు చేయమంటారా.. నా కుమార్తెను చూడటానికి వెళ్తున్నా.. కావాలంటే మీరూ రండి... తమాషాలు చేస్తున్నారా! మేం చూడని ప్రభుత్వాలా. మేం చూడని పోలీసులా.. ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది..’’ అంటూ విజయమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన కుమార్తె వచ్చేదాక నిరాహార దీక్ష చేస్తానంటూ నివాసంలో బైఠాయించారు. ఈ సందర్భంగా విలేకరులు జగన్‌ ప్రస్తావన తీసుకురాగా.. ఇప్పుడు ఏపీ సీఎం, ఆ రాష్ట్రానికి.. మనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. షర్మిలకు బెయిలు మంజూరు కావడంతో విజయమ్మ దీక్షను విరమించారు.


గవర్నర్‌ ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: షర్మిల అరెస్టు పరిణామాలపై గవర్నర్‌ తమిళిసై ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. షర్మిల కారులో ఉండగానే ఆ వాహనాన్ని క్రేన్‌తో లాక్కెళ్లిన దృశ్యాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న మహిళలను గౌరవప్రదంగా చూడాలని ఆమె పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు