మాది అభివృద్ధి మంత్రం

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను మళ్లీ విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ముందుకెళ్తున్నారు. గత ఐదేళ్లలో తన నేతృత్వంలోని సర్కారు రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భద్రత కోసం తీసుకున్న చర్యలను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తూనే.. నేరగాళ్లతో సత్సంబంధాలు కలిగి ఉందంటూ ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజా ఎన్నికలను తమ

Published : 23 Feb 2022 06:03 IST

రాష్ట్రంలో అధికార పగ్గాలు మళ్లీ భాజపాకే 

‘ఈటీవీ భారత్‌’తో ముఖాముఖిలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను మళ్లీ విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ముందుకెళ్తున్నారు. గత ఐదేళ్లలో తన నేతృత్వంలోని సర్కారు రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భద్రత కోసం తీసుకున్న చర్యలను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తూనే.. నేరగాళ్లతో సత్సంబంధాలు కలిగి ఉందంటూ ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజా ఎన్నికలను తమ అభివృద్ధి నినాదానికి, ఎస్పీ మాఫియావాదానికి మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణిస్తున్నారు. రాష్ట్రంలో ఈ దఫా కూడా పాలనా పగ్గాలు చేపట్టబోయేది కమలదళమేనని ధీమాగా చెబుతున్నారు. ఎన్నికల ప్రచార పర్వంలో తీరిక లేకుండా గడుపుతున్న ఆయన.. తాజాగా ‘ఈటీవీ భారత్‌’తో ముఖాముఖిలో పలు అంశాలపై మాట్లాడారు. ఆ విశేషాలివీ..

రాష్ట్రంలో ఇప్పటివరకు ముగిసిన విడతలను బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో భాజపా ఏ స్థితిలో ఉందనుకుంటున్నారు.

మా ఎజెండాలో జాతీయవాదం, అభివృద్ధి, సుపరిపాలన వంటి అంశాలు ఉన్నాయి. కుల, మత, వర్గ భేదాలకు తావివ్వకుండా అందరి శ్రేయస్సు కోసం భాజపా పనిచేస్తుందని ప్రజలకు తెలుసు. ఇప్పటివరకు ముగిసిన విడతలను పరిశీలిస్తే.. ఓటర్లు మా పక్షానే ఉన్నారని స్పష్టమవుతోంది.

అహ్మదాబాద్‌ పేలుళ్ల ఘటనలో దోషిగా తేలిన ఓ వ్యక్తి తండ్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనిపై మీ స్పందనేంటి.

ఎస్పీ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరించే ప్రయత్నాలు జరిగాయి. రాజకీయ ప్రయోజనాలు, ఓటుబ్యాంకు పరిరక్షణే ధ్యేయంగా వారి ప్రభుత్వం పనిచేసింది. రాష్ట్రంలో గూండాలు, మాఫియాకు ఆశ్రయం కల్పించింది. అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో శిక్ష ఖరారైనవారిలో యూపీకి చెందినవారు 9 మంది ఉన్నారు. వారిలో ఒకడు ఆజంగఢ్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని సంజార్పుర్‌ గ్రామానికి చెందినవాడు. అతడు సిరియాకు పారిపోయాడు. అతడి తండ్రి ఎస్పీలో క్రియాశీల కార్యకర్త. ఆ పార్టీ తరఫున ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నాడు. సిరియాకు పారిపోయినవాడి సోదరుడికి దిల్లీ బాట్లాహౌజ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనతో సంబంధముంది. ఉగ్రవాదుల కదలికలు సంజార్పుర్‌ చుట్టుపక్కల ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్నది, పెద్దది అనే తేడా లేకుండా అన్ని ఘటనలపై స్పందించే అఖిలేశ్‌..  2013 నాటి ముజఫర్‌నగర్‌ అల్లర్లపై  ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి.

ఆందోళనకారుల విధ్వంసంలో జరిగే నష్టానికి వారి నుంచే పరిహారం వసూలు చేయాలని మీరు గతంలో నిర్ణయించారు. సుప్రీంకోర్టు జోక్యంతో సంబంధిత తాఖీదులను వెనక్కితీసుకున్నారు. మళ్లీ అధికార పీఠమెక్కితే ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్తారు.

పరిపాలనాపరమైన ఉత్తర్వుల ద్వారా కాకుండా ట్రైబ్యునళ్ల ద్వారా నష్టపరిహారాన్ని వసూలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. దానికి అనుగుణంగా మేం ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఆందోళనకారుల నుంచి పరిహారం వసూలు చేసే విషయంపై చట్టం తీసుకొచ్చాం. మూడు ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేశాం.

హిజాబ్‌ వివాదాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు.

దేశంలో వ్యవస్థలన్నీ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. వ్యక్తిగత/షరియా చట్టాల ప్రకారం కాదు. ఇంట్లో ఉంటే.. నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు. ఏదైనా సంస్థ/ఇన్‌స్టిట్యూట్‌లో ఏకరూప దుస్తుల నియమావళి(డ్రెస్‌కోడ్‌) ఉంటే దాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందే.

కరోనా రెండో ఉద్ధృతి సమయంలో మీ సర్కారు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. వాటిపై మీరేమంటారు.

కొవిడ్‌ ఉద్ధృతంగా వ్యాపిస్తున్నప్పుడు కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీ నేతలంతా ఇళ్లలో ఉండిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే క్రియాశీలకంగా పనిచేశాయి. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు, బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు మేం అన్ని ఏర్పాట్లు చేశాం. కొవిడ్‌ కట్టడి విషయంలో మా పనితీరుపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి కూడా.

మీ అభివృద్ధి కార్యక్రమాల జాబితా పెద్దదే. అలాంటిప్పుడు జిన్నా, ఉగ్రవాదం వంటివి ఎన్నికల్లో ఎందుకు ప్రాధాన్యాంశాలుగా మారాయి.

నిజానికి నేను అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడాలనుకున్నా. కానీ, సర్దార్‌ పటేల్‌ జయంతి రోజు దేశమంతా సంబరాలు చేసుకుంటుంటే.. సమాజ్‌వాదీ పార్టీ మొహమ్మద్‌ అలీ జిన్నాను కీర్తిస్తూ మాట్లాడింది. రాష్ట్రంలో యువతకు మేం స్మార్ట్‌ఫోన్లు అందిస్తున్న రోజు ఆ పార్టీ పాకిస్థాన్‌ను పొగిడింది. ఈ అంశాలన్నింటినీ తొలుత లేవనెత్తింది ఎస్పీయే తప్ప, మేము కాదు. ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ అనే నినాదంతోనే మేం ఎన్నికల బరిలో దిగాం.

రాష్ట్రంలో ఈ దఫా కమలదళం ఎన్ని సీట్లు గెలుస్తుందని మీ అంచనా.

రాష్ట్రంలో ప్రస్తుతం పోరు ‘80% వర్సెస్‌ 20%’గా ఉంది. సానుకూల ధోరణితో ఆలోచించేవారు, జాతీయవాదులు, సంక్షేమ పథకాలకు మద్దతిచ్చేవారు.. ‘80%’ కోటాలోకి వస్తారు. మాఫియా పాలన, నేరాలు, అరాచకత్వం, అవినీతిని ఇష్టపడేవారు ‘20%’ కోటాలో ఉంటారు. మేం 80 శాతం ఓట్లు దక్కించుకొని, అఖండ విజయం సాధిస్తాం.

మాఫియాపై చర్యల విషయంలో అఖిలేశ్‌ మిమ్మల్ని ‘బుల్డోజర్‌ బాబా’ అని ఎద్దేవా చేశారు. దానిపై మీరేమంటారు.

రాష్ట్రంలో ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు పేదలు, యువత, రైతుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అది విచారకరమైన విషయం. ఉగ్రవాదుల విషయంలో ఆ పార్టీ చాలా మెతకగా వ్యవహరించింది. వారి ప్రభుత్వం ఉన్నప్పుడు నేరగాళ్లు, మాఫియాకు భయమన్నదే లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం.. మేం అధికారంలోకి వచ్చాక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాం. అభివృద్ధి, భద్రత సంబంధిత అంశాలపై మా ప్రభుత్వం ఇకపై కూడా రాజీ లేకుండా పనిచేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని