ప్రధాని నరేంద్ర మోదీతో మీకు పోలికా?

కుటుంబ పార్టీల కారణంగానే దేశంలో అవినీతి పెరిగిపోయిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్ల మీ కుటుంబ పాలనలో దోచుకుంది చాలదా? ఇంకా ఏం సంచలనాలు సృష్టిస్తారు? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌ భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. బెంగళూరు పర్యటనలో సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రధాని మోదీ దేశం కోసం ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తుంటే.. తెలంగాణ సీఎం

Published : 28 May 2022 05:45 IST

 సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: కుటుంబ పార్టీల కారణంగానే దేశంలో అవినీతి పెరిగిపోయిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్ల మీ కుటుంబ పాలనలో దోచుకుంది చాలదా? ఇంకా ఏం సంచలనాలు సృష్టిస్తారు? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌ భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. బెంగళూరు పర్యటనలో సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రధాని మోదీ దేశం కోసం ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాత్రం నెలకు 18 గంటలు పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీతో మీకు పోలికా అంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, బస్తీ దవాఖానాలకు నిధులు, పేదలకు సబ్సిడీ బియ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా, జాతీయ రహదారుల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు, కేంద్ర ఆర్థిక సంస్థల రుణాల అంశాలపై చర్చకు సిద్ధమా?’’ అని ముఖ్యమంత్రికి కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ‘‘మజ్లిస్‌ పార్టీతో కలిసి నిజాం తరహాలో పాలిస్తున్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల్ని ముంచడానికి ప్రయత్నిస్తోంది. కేసీఆర్‌కు భయం పట్టుకుంది. ఆ భయంతోనే రాజకీయ సంచలనాలు అంటున్నారు. కుటుంబ, కులాల పాలన కాకుండా ప్రజాపాలనే భాజపా లక్ష్యం. జేపీ నడ్డా తర్వాత ఆయన వారసులు భాజపా అధ్యక్షులు కారు. మీ పదవుల్లోకి మీ వారసులు రారు అని చెప్పగలిగే ధైర్యం ఉందా? దళిత సీఎం హామీని నిలబెట్టుకుంటారా? నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిపించారా? నిరుద్యోగ భృతి, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య హామీలు అమలుచేశారా?’’ అని కేసీఆర్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రైవేట్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి ఒప్పందం అంటూ దావోస్‌ నుంచి మంత్రి కేటీఆర్‌ తప్పుడు ప్రచారం చేశారన్నారు. స్విట్జర్లాండ్‌ సంస్థతో కలిసి మేధా కంపెనీ ఏర్పాటుచేస్తున్న ఈ ఫ్యాక్టరీ గురించి రైల్వే శాఖ మంత్రిని, తనను గతంలోనే కలిశారని, కోచ్‌ల తయారీకి ఆర్డర్లు ఇచ్చేది, వాటిని కొనుగోలు చేసేది కేంద్ర ప్రభుత్వమేనని కిషన్‌రెడ్డి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని