Siddaramaiah: ‘అలాగైతేనే 5ఏళ్ల పాటు మా నాన్న సీఎం కుర్చీలో’.. సిద్ధరామయ్య కుమారుడి కీలక వ్యాఖ్యలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ప్రదర్శన చేస్తేనే తన తండ్రి సీఎం కుర్చీలో ఐదేళ్ల పాటు కొనసాగుతారని అన్నారు.

Published : 17 Jan 2024 17:26 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్‌ నాయకత్వ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కుమారుడు యతీంద్ర చేసిన వ్యాఖ్యలే అందుక్కారణం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) మెరుగైన ప్రదర్శన చేస్తేనే.. తన తండ్రి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఐదేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగగలరని ఆయన అన్నారు.

హసన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యతీంద్ర (Yathindra) మాట్లాడుతూ.. ‘‘అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సిద్ధరామయ్య ప్రభుత్వం పలు గ్యారెంటీలను అమలు చేస్తోంది. మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందని రుజువైంది (అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశిస్తూ). రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ (Lok Sabha Elections 2024) ప్రజలు దాన్ని చాటి చెప్పాలి. మరిన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలి. అప్పుడే ఎలాంటి అడ్డంకులు లేకుండా సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగగలరు. ఆ గ్యారెంటీలూ కొనసాగుతాయి’’ అని యతీంద్ర వ్యాఖ్యానించారు. ఇవి కాస్తా రాజకీయంగా చర్చకు దారితీశాయి.

లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై భాజపా భేటీ

గతేడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. తీవ్ర ఉత్కంఠ తర్వాత చివరకు సిద్ధు ముఖ్యమంత్రిగా.. డీకే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, వీరిద్దరూ పదవీకాలాన్ని పంచుకునే అవకాశముందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

తొలి రెండున్నరేళ్ల పాటు సిద్ధు, ఆ తర్వాత డీకే సీఎం బాధ్యతలు చేపట్టేలా ఒప్పందం కుదిరినట్లు ఊహాగానాలు వినిపించాయి. వీటిని కాంగ్రెస్‌ అధిష్ఠానం సమర్థించలేదు. అలాగనీ ఖండించలేదు. ఈ క్రమంలోనే తాజాగా యతీంద్ర చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు