Amit Shah: సీఎంల ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌.. అమిత్‌ షా ఆసక్తికర పోస్టు!

భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. 

Updated : 10 Dec 2023 08:11 IST

న్యూదిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా (BJP)దేశంలోని మూడు కీలక రాష్ట్రాల్లో విజయం సాధించించి మంచి జోష్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌ (Madhyapradesh)లో అధికారాన్ని నిలుపుకోవడమే కాకుండా రాజస్థాన్‌ (Rajasthan), ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)ఎన్నికల్లో ప్రత్యర్థి కాంగ్రెస్‌ (Congress)ను ఓడించింది. అయితే ఫలితాలు వచ్చి ఏడు రోజులు అవుతున్నా ఇంతవరకు ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో ఇటు కాంగ్రెస్‌తో పాటు అటు దేశంలోని ప్రధానపార్టీల నుంచి భాజపా విమర్శలు ఎదుర్కొంటోంది. 

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) సోషల్‌ మీడియా వేదికగా ఒక పోస్టు చేశారు. తన మనవరాళ్లతో కలిసి చదరంగం (chess)ఆడుతున్న ఫొటోను పంచుకుని దానికి ఒక క్యాప్షన్‌ ఇచ్చారు. ‘‘ఒక మంచి ఎత్తుగడతో ఆగిపోకండి. ఎప్పటికీ ఉత్తమమైన దాని కోసం చూడండి’’ అని పేర్కొన్నారు. దీంతో ఆ పోస్టు ఆసక్తికరంగా మారింది. సీఎంల ఎంపికలో ఉత్కంఠ కొనసాగుతుండడంపై విమర్శలకు కౌంటర్‌గానే అమిత్‌ ఈ పోస్టు చేశారని పలువురు భావిస్తున్నారు. 

ఇప్పటికే మూడు రాష్ట్రాలకు సీఎం ఎవరనేది నిర్ణయించడానికి భాజపా పరిశీలకులను నియమించింది. మధ్యప్రదేశ్‌ పరిశీలకులుగా హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, జాతీయ కార్యదర్శి ఆశా లక్డా, రాజస్థాన్‌ పరిశీలకులుగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎంపీ సరోజ్‌ పాండే, పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్‌ థావ్డే, ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర మంత్రులు అర్జున్‌ ముండా, శర్బానంద సోనోవాల్‌, భాజపా ప్రధాన కార్యదర్శి దుష్యంత్‌ కుమార్‌ గౌతమ్‌ను నియమించారు. సోమవారం నాటికి సీఎంలను ప్రకటించవచ్చని భాజపా వర్గాలు పేర్కొంటున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని