Agnipath: వారిని సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకుంటాం.. అగ్నివీరులపై వివాదాస్పద వ్యాఖ్యలు!

అగ్నిపథ్‌ (Agnipath scheme) పథకంపై దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భాజపాకు (BJP) చెందిన నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Updated : 19 Jun 2022 19:51 IST

దిల్లీ: అగ్నిపథ్‌ (Agnipath scheme) పథకంపై దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భాజపాకు (BJP) చెందిన నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్నివీరులను (Agniveers) తమ పార్టీ ఆఫీసుకు సెక్యూరిటీగా గార్డులుగా పెట్టుకుంటామంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో.. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ సర్ది చెప్పుకొనే ప్రయత్నం చేశారు.

అగ్నిపథ్‌పై (Agnipath scheme) ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుండగా.. మరోవైపు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ ప్రభుత్వం ఓ వైపు పథకం ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన భాజపా నేత కైలాష్‌ విజయ్‌ వర్గీయ ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ నోరు జారారు. ‘‘మిలటరీ శిక్షణ తీసుకున్న అగ్నివీరులు నాలుగేళ్ల తర్వాత సర్వీసు నుంచి వైదొలుగుతారు. అప్పుడు వారికి రూ.11 లక్షలు వస్తాయి. వారికి అగ్నివీర్‌ బ్యాడ్జ్‌ కూడా వస్తుంది. ఒకవేళ నేను భాజపా ఆఫీసుకు సెక్యూరిటీని నియమించాలనుకుంటే అగ్నివీరులకు ప్రాధాన్యం ఇస్తా’’ అని అన్నారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

కైలాష్‌ విజయ్‌ వర్గీయ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ, శివసేన, ఎంఐఎం మండిపడ్డాయి. దేశ యువత రాత్రింబవళ్లు కష్టపడేది సైనికుడిగా దేశం కోసం సేవ చేయడానికేగానీ, భాజపా కార్యాలయాల వద్ద కాపలా కాయడానికి కాదు అంటూ కేజ్రీవాల్‌ విమర్శించారు. ఈ పథకంపై ఉన్న అనుమానాలన్నింటినీ కైలాష్‌ విజయ్‌ వర్గీయ నివృత్తి చేశారంటూ కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తామంటూ వ్యాఖ్యానించడం అంటే సాయుధ బలగాలను చిన్న చూపు చూడడమే అని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. అగ్నివీరులను పార్టీ ఆఫీసులకు కాపాలా పెట్టుకుంటామంటారా? ఇదేనా సైనికులకు భాజపా ఇచ్చే గౌరవం? అంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడంతో కైలాష్‌ విజయ్‌ వర్గీయ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను టూల్‌ కిట్‌ గ్యాంగ్‌ వక్రీకరించిందని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు