ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీ పరిధిలోకి వెళ్తే తీవ్ర నష్టం: కేసీఆర్‌

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 3 నెలల విరామం అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చారు.

Updated : 06 Feb 2024 15:09 IST

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్‌ 3 నెలల విరామం అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. జై తెలంగాణ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులతో మాట్లాడిన కేసీఆర్‌.. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లపై సమీక్షించారు.

అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రయోజనాలే భారాసకు ముఖ్యం. కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. చివరకు డ్యామ్‌కు సున్నం వేయాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. భారాసకు పోరాటం చేయడం కొత్త కాదు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించ వద్దనే మా పోరాటం. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలివి లేదు. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం రైతుల సాగునీటి హక్కులకు గొడ్డలిపెట్టు లాంటిది. నల్గొండ జిల్లాలో ఈ నెల 13న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం. రాష్ట్ర హక్కులు కాపాడేందుకు ఎంతకైనా పోరాడుతాం. కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం. మరో ప్రజా ఉద్యమంతో తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుతాం’’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని