Arvind Kejriwal: డిన్నర్‌ విత్‌ కేజ్రీవాల్‌.. ఆమ్‌ ఆద్మీ కొత్త ప్రచారం

ఉత్తరప్రదేశ్‌ సహా వచ్చే నెలలో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ మరో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ

Published : 25 Jan 2022 01:10 IST

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌ సహా వచ్చే నెలలో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ మరో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయా రాష్ట్రాల ప్రజలను కోరాలంటూ దిల్లీ ప్రజలను అభ్యర్థించింది. అలా చేసిన వారికి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి డిన్నర్‌ చేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలిపింది.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ డిజిటల్‌ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ‘ఏక్‌ మోకా కేజ్రీవాల్‌ కో (కేజ్రీవాల్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి) పేరిట నేడు సరికొత్త ప్రచారాన్ని కేజ్రీవాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దిల్లీ ప్రజల కోసం మా ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. ఉచిత విద్యుత్తు, ఉచిత మంచినీరు వంటి పథకాలను అమలు చేస్తోంది. ఇక్కడ మేం నడుపుతున్న మెహల్లా క్లినిక్‌లను చూసేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు వచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మన దిల్లీ పాఠశాలలను సందర్శించారు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. దిల్లీ ప్రజలు నాకు అవకాశం ఇవ్వడం వల్లే ఇవన్నీ చేయగలిగాం. అందువల్ల, యూపీ సహా ఎన్నికలు జరిగే రాష్ట్రాల ప్రజలకు కూడా ఈ విషయాలను చెప్పండి. దిల్లీ ప్రభుత్వం చేసిన పనుల పై, వాటి వల్ల మీరు పొందిన ప్రయోజనాల గురించి వీడియోలు చేసి ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాల్లో షేర్‌ చేయండి. కేజ్రీవాల్‌కు ఒక్క అవకాశం ఇవ్వమని ఆయా రాష్ట్రాల ప్రజలను కోరండి’’ అని కేజ్రీవాల్‌ దిల్లీ వాసులకు విజ్ఞప్తి చేశారు. అంతేగాక, అలా వీడియోలు చేసిన వారికి తనను నేరుగా కలిసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. వాటిల్లో అత్యధికంగా వైరల్‌ అయిన 50 మంది దిల్లీ వ్యక్తులను ఎన్నికల తర్వాత ప్రత్యేకంగా ఆహ్వానించి.. వారితో డిన్నర్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

పంజాబ్, ఉత్తరప్రదేశ్‌, గోవా, ఉత్తరాఖండ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీని విస్తరించేందుకు కేజ్రీవాల్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పంజాబ్‌లో ఇప్పటికే రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న ఆప్‌.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారనుంది. పంజాబ్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేజ్రీవాల్‌.. అక్కడ భగవంత్‌ మాన్‌ను సీఎంగా అభ్యర్థిగా ప్రకటించారు. ఇక యూపీ, గోవా, ఉత్తరాఖండ్‌లోనూ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది. గోవాలో ఇప్పటికే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. ఉత్తరాఖండ్‌లో రిటైర్డ్‌ కల్నల్ అజయ్‌ కొటియాల్‌ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని