Kesineni Swetha: తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్తామని కలలో కూడా ఊహించలేదు: కేశినేని శ్వేత

తెలుగుదేశం పార్టీని వీడాల్సి వస్తుందని తాను, ఎంపీ కేశినేని నాని ఎప్పుడూ ఊహించలేదని శ్వేత అన్నారు.

Updated : 08 Jan 2024 19:03 IST

విజయవాడ: తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్తామని కలలో కూడా ఊహించలేదని విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ కేశినేని శ్వేత అన్నారు. కార్పొరేటర్‌ పదవికి శ్వేత సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను నగర మేయర్‌కు అందజేశారు. రాజీనామా ఆమోదం తర్వాత తెదేపాను వీడనున్నట్లు చెప్పారు.

అనంతరం శ్వేత మాట్లాడుతూ.. ‘‘పార్టీని వీడాల్సి వస్తుందని నేను, ఎంపీ కేశినేని నాని ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే.. పార్టీ, అధినేత చంద్రబాబుపై మాకున్న అభిమానం, ప్రేమ అలాంటిది. కానీ ఈరోజు పార్టీయే మమ్మల్ని కాదనుకుంటోంది. అధినేతే మమ్మల్ని వద్దనుకుంటున్నారు. ఒక సిట్టింగ్‌ ఎంపీ అయిన కేశినేని నానికి.. విజయవాడ ప్రాంతంలో జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దని సమాచారం వచ్చింది. ఇంత జరిగిన తర్వాత పార్టీలో ఉండడం సరైంది కాదని మేం భావించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మేం ఎవరినీ తప్పుబట్టడం లేదు. పార్టీ కోసం అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు’’ అని అన్నారు.

తెలుగుదేశం పార్టీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘తెదేపాకు నా అవసరం లేదని అధినేత చంద్రబాబు భావించిన తరువాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్‌ కాదని నా భావన. కాబట్టి త్వరలోనే దిల్లీ వెళ్లి స్పీకర్‌ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. దాన్ని ఆమోదించిన మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా’’ అని ఈ నెల 6న ఎక్స్‌లో నాని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని