KTR: ఉద్యమ సహచరుడి మృతి తీరని లోటు.. కేటీఆర్‌ కంటతడి

రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయిచంద్‌ మృతదేహానికి మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ తదితరులు నివాళులర్పించారు.

Updated : 29 Jun 2023 13:44 IST

హైదరాబాద్‌: రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయిచంద్‌ మృతదేహానికి మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ తదితరులు నివాళులర్పించారు. నగరంలోని గుర్రంగూడలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ క్రమంలో కేటీఆర్‌ కంటతడి పెట్టారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.

‘‘తెలంగాణ ఉద్యమంలో తన అరుదైన కళా నైపుణ్యం, గాత్రంతో అలరించిన తమ్ముడు సాయిచంద్‌ మరణం చాలా బాధాకరం. ఉద్యమ సహచరుడి మృతి తీరనిలోటు. ఆయన హైదరాబాద్‌లో ఉంటే బతికేవాడేమో. స్వగ్రామానికి వెళ్లడం.. అక్కడే ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ఆయన కుటుంబాన్ని చూస్తుంటే చాలా బాధేస్తోంది. వారిని ఎంత ఓదార్చినా.. సర్దిచెప్పే పరిస్థితి మాకెవరికీ లేదు. సాయిచంద్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం’’ అని కేటీఆర్‌ అన్నారు.

మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సాయిచంద్‌ లేడని ఊహించుకుంటేనే బాధగా ఉందన్నారు. ‘‘చిన్న వయసులోనే సాయిచంద్‌ చనిపోవడం దురదృష్టకరం. అతడు నిజాయతీ గల సైనికుడు. ఆయన పాట ఖండాంతరాలు దాటింది. నా మనసుకు దగ్గరైన వ్యక్తి. చాలాసార్లు మా ఇంటికి వచ్చాడు. సాయిని మళ్లీ తిరిగి తెచ్చుకోలేము. ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. 

తన మాటలు, పాటలతో భారాస సభలను సాయిచంద్‌ విజయవంతం చేశాడని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. అతడి మరణం అందరినీ తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్‌ సుడిగాలిలా వచ్చి ఎన్నో పాటలు పాడారని దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. గొప్పనాయకుడిగా ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోతాడని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని