KTR: కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్‌

చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్‌ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచించారు.

Published : 29 Mar 2024 16:35 IST

హైదరాబాద్‌: చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్‌ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేకే, కడియం వంటి నాయకులు పార్టీని కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారని.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్నారు. 

‘‘అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్లలో చాలా చోట్ల ప్రచారం చేశాను. తాండూరు అసెంబ్లీ సీటు ఏకపక్షంగా గెలుస్తామనుకున్నాం. ఏం జరిగిందో తెలియదు.. కొన్ని చోట్ల ఓడిపోయాం. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు. పట్నం మహేందర్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొదట రంజిత్‌రెడ్డే ఫోన్‌ చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా నన్ను ప్రకటించు..తప్పకుండా గెలుద్దామని చెప్పారు. 

రంజిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి నాకంటే ఎక్కువగా కాంగ్రెస్‌ను తిట్టారు. ఆస్కార్‌ నటుల కంటే బాగా నటించారు. పార్టీ మారిన వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలి. సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన వాళ్లు బాధ పడే పరిస్థితి వచ్చింది. తుక్కుగూడ కాంగ్రెస్‌ సభకు కర్ణాటక నుంచి కూడా జనాలను తెప్పిస్తున్నారు. ఏప్రిల్‌ 13న చేవెళ్లలో జరిగే కేసీఆర్‌ సభను విజయవంతం చేద్దాం. రైతుల నుంచే నిప్పు రగిలిద్దాం.. ఉద్యమం ఉద్ధృతం చేద్దాం’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని