JDU: జేడీ(యూ)కు బిగ్ షాక్‌.. ఉపేంద్ర కుష్వాహా రాజీనామా

బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ తన చుట్టూ వున్న ముగ్గురు నలుగురి మాటలు విని నిర్ణయాలు తీసుకొంటున్నారని కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా ఆరోపించారు. గత కొంత కాలంగా జేడీ(యూ) పట్ల అసంతృప్తితో ఉన్న ఆయన ఈరోజు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Published : 21 Feb 2023 01:16 IST

పట్నా: బిహార్‌లో సీఎం నీతీశ్‌ కుమార్‌( Nitish Kumar)కు చెందిన జేడీ(యూ) పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. గత కొంత కాలంగా నీతీశ్‌ తీరు పట్ల పట్ల అసంతృప్తితో ఉన్న కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా(Upendra Kushwaha) ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పట్నాలో ఆయన మీడియా సమావేశంల ఈ విషయాన్ని ప్రకటించారు. కుష్వాహా సొంతంగా పార్టీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు, తన శాసనమండలి సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తానని.. ఇప్పటికే మండలి ఛైర్మన్‌ను అపాయింట్‌మెంట్‌ కోరినట్టు ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు పట్నాలోని సిన్హా లైబ్రరీలో మద్దతుదారులతో చర్చించిన అనంతరం రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి రాజీనామా అంశంపై ఇప్పటికే సీఎం నీతీశ్‌ కుమార్‌‌, పార్టీ జాతీయ అధ్యక్షుడు లలన్‌ సింగ్‌కు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. గతంలో తన పార్టీ రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ(RLSP)ని 2021 మార్చిలో జేడీ(యూ)లో విలీనం చేసిన విషయం తెలిసిందే.

తన పార్టీ ఆర్‌ఎల్‌ఎస్పీని జేడీ(యూ)లో విలీనం చేసిన మొదట్లో పార్టీలో అంతా బాగానే ఉండేదని.. నీతీశ్‌ తన రాజకీయ వారసత్వాన్ని తేజస్వీ యాదవ్‌కు అప్పగిస్తానని అనడం పార్టీని బాధిస్తోందని తెలిపారు. తేజస్వీ బిహార్‌ సీఎం అయితే.. పార్టీ నాశనమవుతుందన్న తన సలహాను నీతీశ్‌ పట్టించుకోలేదన్నారు. నీతీశ్‌ ఇప్పటికే మునిగిపోయారని.. జేడీ(యూ) పడవ మునగడం తనకు ఇష్టంలేదేన్నారు. సమతా పార్టీ, జేడీ(యూ) రెండూ లాలూప్రసాద్‌ యాదవ్‌ ‘జంగిల్‌ రాజ్‌’కు వ్యతిరేకంగానే ఏర్పాటయ్యాయని.. కానీ ఇప్పుడు నీతీశ్‌ వారితోనే చేతులు కలిపారని విమర్శించారు. నీతీశ్‌ చర్యలు బిహార్‌లో ఆయన రాజకీయ వారసత్వాన్ని నాశనం చేస్తాయన్నారు. తన చుట్టూ ఉన్న కొందమంది నేతల సూచనల మేరకే సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని కుష్వాహా ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని