Andhra News: నవంబరులోనే ఆహ్వానం వచ్చింది.. తెదేపా నేతలది దుష్ప్రచారమే: మంత్రి అమర్‌నాథ్‌

దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదంటూ తెదేపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు.

Published : 18 Jan 2023 08:10 IST

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదంటూ తెదేపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం విశాఖ గవర్నర్‌ బంగ్లాలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సదస్సులో పాల్గొనాలని గతేడాది నవంబరు 25న సీఎంకు, ప్రభుత్వానికి ఆహ్వానాలు అందాయని చెబుతూ ఆయా లేఖలను మీడియాకు చూపించారు. ఈ ఏడాది మార్చిలో విశాఖలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సుకు ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించాలనే ఉద్దేశంతో సీఎం ఉన్నారని, అందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున దావోస్‌ సదస్సుకు వెళ్లలేదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో దావోస్‌ సదస్సుకు వెళ్లి చాలా ఘనత సాధించానని చెప్పుకొంటున్న చంద్రబాబును ఆ వేదికపై ఉపన్యసించాలని నిర్వాహకులు ఎప్పుడైనా ఆహ్వానించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఏడాదికి రూ.11వేల కోట్ల పెట్టుబడులు వస్తే.. జగన్‌ పాలనలో ఏడాదికి రూ.15వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు జరిగే నాటికి కొత్త పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి వాహనంపై తెదేపా, జనసేన ఉమ్మడి ప్రచారం చేస్తే మంచిదని, చంద్రబాబు, పవన్‌లది భార్యాభర్తల బంధమని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని