Harishrao: సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా?: హరీశ్‌రావు

సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పందించారు. 

Updated : 04 May 2023 17:42 IST

హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పందించారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు  మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.‘‘సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా?వందే భారత్‌ రైలు ప్రారంభానికి రాష్ట్రపతిని ప్రధాని పిలిచారా? వందే భారత్‌ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారు అని అడిగామా? ఎన్ని సార్లు, ఎవరు ప్రారంభించాలో కార్య నిర్వాహక వ్యవస్థ ఇష్టం. గవర్నర్‌గా, మహిళగా తమిళిసైని గౌరవిస్తాం. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గవర్నర్‌ వ్యవహరించడం బాధ కలిగిస్తోంది. 

వైద్యవిద్య ప్రొఫెసర్ల విరమణ వయసు పెంపు బిల్లు ఏడు నెలలు ఆపడం  అవసరమా?సుప్రీంకోర్టు మెట్లెక్కితే తప్ప బిల్లులపై కదలిక రాలేదు.. ఇది సమంజసమా? రాష్ట్రంలో అనుభవం ఉన్న ప్రొఫెసర్లు లేరని పదవీ విరమణ వయసు పెంచాం. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకాలు ఇతర రాష్ట్రాలు చేపట్టడం లేదా? విశ్వవిద్యాలయాల బిల్లు ఏడు నెలలు ఆపి తిప్పి పంపడం ఎంత అన్యాయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయడం కదా?రాష్ట్ర విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయడమే. గతంలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీలకు ఆమోద ముద్రవేసిన గవర్నర్‌ ఇప్పుడు 7 ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు వెనక్కి పంపడం రాజకీయం కాకపోతే మరేమిటి?’’ అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

గవర్నర్‌ తమిళిసై ఏమన్నారంటే?..

బుధవారం గచ్చిబౌలిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ... భారతదేశానికి వచ్చే దేశాధినేతలను సైతం కలుసుకునే అవకాశం ఉంటుంది కానీ.. తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రిని కలవలేమని, ఇదో దురదృష్టకరమైన పరిస్థితి అని అన్నారు. కొన్ని దేశాలు దగ్గర కావచ్చుకానీ రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మాత్రం కాలేవన్నారు. ‘ఇటీవల పెద్ద సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.. రాష్ట్ర ప్రథమ పౌరురాలికి మాత్రం ఆహ్వానం లేదు’ అని వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రైనా, గవర్నరైనా, మంత్రులైనా ఓపెన్‌ మైండ్‌తో ఉండాలని, తమ కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్రం, దేశం కోసం పనిచేయాలని సూచించారు. ‘కొందరు ముందుగా ప్రజలకు మంచి చేసిన తర్వాత ఆ విషయం గురించి మాట్లాడతారు. కానీ కొందరు కేవలం మాటలు చెబుతారే తప్ప ఏమీ చేయరంటూ’ విమర్శించారు. ప్రభుత్వాలు ఏం చేసినా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసమే చేయాలి తప్ప సొంత కుటుంబాల వృద్ధి కోసం కాకూడదన్నారు. ‘రాష్ట్రాన్ని పాలించే వారు ప్రజల కోసం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అహంకారాన్ని పక్కనపెట్టి విశాల దృక్పథంతో పరస్పరం చర్చించుకోవాలి. సమస్యలకు పరిష్కారం చూపాలి’’ అని గవర్నర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని