KTR: కేంద్రం తీరుకు నిరసనగా ఐదంచెల పోరాటం: కేటీఆర్‌

యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై దిల్లీలోని నాయకులు ఒక విధంగా... గల్లీలోని

Updated : 02 Apr 2022 18:19 IST

హైదరాబాద్‌: యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై దిల్లీలోని నాయకులు ఒక విధంగా... గల్లీలోని నాయకులు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఐదంచెల పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన ఉద్యమ కార్యాచరణను మంత్రి ప్రకటించారు.

దిల్లీ భాజపా నేతలు ఒకలా.. సిల్లీ భాజపా నేతలు మరోలా?

‘‘గతేడాది యాసంగి పంట సమయంలో సీఎం, మంత్రులు పలుమార్లు దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిశారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కోరితే... ఏటా కొనుగోలు చేస్తున్న మాట నిజమే. కానీ, ఇకపై పారాబాయిల్డ్‌ రైస్‌ కొనబోమని చెప్పారు. లక్షలాది మంది రైతుల శ్రేయస్సు దృష్ట్యా బాయిల్డ్‌ రైస్‌, రా రైస్‌ అని నిబంధనలు పెట్టొద్దని విజ్ఞప్తి చేశాం. కేంద్రం పెద్దమనసు చేసుకొని నిబంధనలు పెట్టకుండా ధాన్యం కొనాలని చెప్పాం. గతంలో ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేశారో అలాగే కొనుగోలు చేయాలని కోరాం. ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశాం. కానీ, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రైతుల బాధను అర్థం చేసుకునే ప్రభుత్వం కాదని అర్థమైంది. కేవలం కార్పొరేట్లకు మాత్రమే ఈ ప్రభుత్వం కొమ్ముకాస్తుందని స్పష్టమైంది. దిల్లీ నుంచి తిరిగొచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మీడియా సమావేశం పెట్టి.. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనుగోలు చేయనంటోంది. యాసంగిలో వరి వేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కానీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. వ్యవసాయ మంత్రి ప్రకటనను తప్పుబట్టారు. ముఖ్యమంత్రిని పట్టించుకోవద్దు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయించే బాధ్యత మాది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తున్నా’’ అని వివిధ సందర్భాల్లో ప్రగల్భాలు పలికారు.

కేంద్ర ప్రభుత్వం ఆనవాయితీగా బియ్యం కొనుగోలు చేస్తుంది. ఈ యాసంగిలో రా రైస్‌ పండించినా, బాయిల్డ్‌ రైస్‌ పండించినా కేంద్ర ప్రభుత్వమే ప్రతి గింజా కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. యాసంగిలో ధాన్యం కొంటారా? కొనరా? దిల్లీలో మాట్లాడుతున్న భాజపా కరెక్టా? ఇక్కడ మాట్లాడుతున్న సిల్లీ భాజపా కరెక్టా? రైతులను కన్ఫ్యూజ్‌ చేయొద్దు. భారతదేశం మొత్తం ఒకటే పాలసీ ఉండాలి. వన్‌ నేషన్.. వన్‌ రేషన్ అంటారు. వన్‌ నేషన్.. వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఎందుకు ఉండదు? పంజాబ్‌లో కొనుగోలు చేస్తారు.. తెలంగాణలో వడ్లు ఎందుకు కొనరని పంచాయితీ పెట్టాం. రైతులు నష్టపోకూడదని, గతేడాది నవంబర్‌ 12న అన్ని జిల్లాల కేంద్రాల్లో ధర్నాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం. లక్షలాది మంది రైతుల సమస్య కాబట్టీ నవంబర్‌ 18న సీఎం, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందిరాపార్కు వద్ద నిరసన తెలిపారు. మేం డిమాండ్‌ చేసిన ప్రతి సారీ... రాష్ట్రానికి సంబంధం లేదని, చివరి గింజ వరకు కొనిపించే బాధ్యత మాదని ఇక్కడి భాజపా నేతలు చెప్పుకొచ్చారు. కానీ, రైతులు మా మాట విని ఈ ఏడాది యాసంగిలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి వేయలేదు. 30 నుంచి 35 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇప్పుడు ఆ పంటలు కోతకొచ్చాయి. కేంద్రం కొనుగోలు చేయమంటోంది. ఎవరు కొనుగోలు చేయాలి?’’ అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

కేంద్రం తీరుపై గ్రామస్థాయి నుంచి పోరాటం...

‘‘కేంద్ర ప్రభుత్వం తీరుపై గ్రామస్థాయి నుంచి పోరాటం చేయాలని నిర్ణయించాం. ఈ నెల 4న తెరాస ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, 6న ముంబయి, నాగ్‌పూర్‌, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై రాస్తారోకో, 7న హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో వేలాది మంది రైతులు, కార్యకర్తలతో నిరసన చేపడతాం. 8న రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో ప్రతి రైతు తన ఇంటి మీద నల్లజెండా ఎగురవేయాలి. ర్యాలీలు నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టి  నిరసన తెలపాలి. 11న దిల్లీలో తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధులు నిరసన తెలుపుతారు. పార్లమెంట్‌లో తెరాస ఎంపీలు గళమెత్తుతారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నా’’ అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని